Mahaa Daily Exclusive

  ఎన్‌సీడబ్ల్యూకు హైకోర్టు నోటీసులు…

Share

  • ఎన్‌సీడబ్ల్యూకు హైకోర్టు నోటీసులు
  • లైంగిక వేధింపుల ఫిర్యాదు మూసివేతపై వివరణ కోరిన ధర్మాసనం
  • ఫిర్యాదును పరిశీలించకుండానే మూసివేశారన్న ఆరోపణ
  • విచారణ జూలై 1కి వాయిదా

హైదరాబాద్, మహా : కార్యాలయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చేసిన ఫిర్యాదును సరైన విచారణ లేకుండానే మూసివేసిన విషయంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ), హైదరాబాద్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఎన్‌సీడబ్ల్యూ, ఏఎస్‌సీఐ, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్‌సీఐ డైరెక్టర్ జనరల్ నిమ్మగడ్డ రమేశ్‌కు నోటీసులు జారీ చేసిన కోర్టు, తమ వాదనలు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది.

58 ఏళ్ల ప్రొఫెసర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ ముందుగా ఏఎస్‌సీఐ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఆశ్రయించిన ఆమె, అనంతరం ఎన్‌సీడబ్ల్యూను సంప్రదించారు. అయితే 2026 జూన్ 3న ఎన్‌సీడబ్ల్యూ తన ఫిర్యాదును మూసివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.డి. అద్నాన్ వాదనలు వినిపించారు. 2013 కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పీఓఎస్‌హెచ్ చట్టం)లోని సెక్షన్-4 నిబంధనలకు విరుద్ధంగా ఐసీసీని ఏర్పాటు చేశారని, సభ్యుల నియామకంలోనూ లోపాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అంశాలను ఎన్‌సీడబ్ల్యూ దృష్టికి తీసుకెళ్లినా, స్వతంత్రంగా పరిశీలించకుండా ఐసీసీ నివేదికను అంగీకరించి కేసును మూసివేసిందని వాదించారు. అంతేకాకుండా, వ్యక్తిగతంగా తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా నిమ్మగడ్డ రమేశ్ తన ఉద్యోగ ఒప్పంద పొడిగింపును కేవలం ఆరు నెలలకే పరిమితం చేశారని కూడా ఆరోపించారు. ఈ అంశాలపై అన్ని ప్రతివాదుల నుంచి వివరణ కోరిన హైకోర్టు, కేసు విచారణను జూలై 1కి వాయిదా వేసింది.