- అవినీతి అధికారి నరహరి రావు
- బ్యాంక్ లాకర్లలోనూ నోట్ల కట్టలే
- మరో కోటిన్నర స్వాధీనం
- మరిన్ని కొత్త లాకర్లను గుర్తించిన ఏసీబీ
హైదరాబాద్, మహా : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సుంకరి నరహరి రావు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం ఏసీబీ అధికారులు కీలక అడుగు వేశారు. హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో నరహరి రావు భార్య పేరిట ఉన్న ఒక బ్యాంకు లాకర్‌ను అధికారులు తెరిచారు. ఆ లాకర్‌ను తనిఖీ చేయగా అధికారులకు దిమ్మతిరిగేలా ఏకంగా రూ. 1.50 కోట్ల అదనపు నగదు లభ్యమైంది. ఈ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్న అధికారులు, వీటిపై పంచనామా నిర్వహించారు.
దర్యాప్తులో భాగంగా నరహరి కుటుంబ సభ్యుల పేరిట మరికొన్ని బ్యాంకుల్లో ఖాతాలు, లాకర్లు ఉన్నట్లు ఏసీబీ సైబర్ ఫైనాన్షియల్ వింగ్ గుర్తించింది. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా మరో రెండు కీలకమైన బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి తనిఖీ చేయాల్సి ఉంది. ఆ మిగిలిన రెండు లాకర్లలో కూడా భారీగా నగదు లేదా బంగారు ఆభరణాలు, బినామీ ఆస్తి పత్రాలు ఉండే అవకాశం ఉందని అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం నరహరి రావు నివాసం, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన నివాసంలోని అటకపై బ్యాగుల్లో దాచి ఉంచిన రూ. 1.54 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ప్రాథమిక సోదాల్లోనే రూ. 2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, రూ. 5.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు ఒక విలాసవంతమైన కియా కారెన్స్ కారును కూడా సీజ్ చేశారు. నరహరి రావు కూడబెట్టిన స్థిరాస్తుల లిస్ట్ చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో ఒక జీ+3 భవనం, చత్రినాకలో జీ+2 ఇల్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఐటీ కారిడార్ పరిధిలోని పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల భారీ ఫ్లాట్, నార్సింగిలో రెండేసి చొప్పున 1,860 చదరపు అడుగుల హైరైజ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లో మరో ఫ్లాట్ ఉన్నట్లు డాక్యుమెంట్లు లభించాయి. డాక్యుమెంట్ల ప్రకారం వీటి విలువ రూ. 13.05 కోట్లుగా చూపించినప్పటికీ.. ప్రస్తుతం మార్కెట్ రేట్ల ప్రకారం వీటి విలువ రూ. 100 కోట్లకు పైమాటేనని అంచనా.








