Mahaa Daily Exclusive

  పవన్ ను బూచిగా చూపి….

Share

  • పవన్ ను బూచిగా చూపి
  • తెలంగాణలో పాగాకు బీజేపీ ప్లాన్
  • టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా : పవన్‍ కళ్యాణ్‍ను బూచిగా చూపి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ చూస్తోందని, అయినప్పటికీ ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడుతూ.. శాశ్వతంగా అధికారంలోకి ఉండటం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని, బీజేపీ చెప్పిందే రాజ్యాంగం అన్నట్టు వ్యవహరిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లోకి దూరిన బీజేపీ రఘుపతి రాఘవ రాజారాం పేరు స్థానంలో గాడ్సే జపం చేస్తోందని ధ్వజమెత్తారు. గాడ్సే రాజ్యం స్థాపన వ్యూహంతో సొంత ఎజెండాను తీసుకొచ్చిన కమలం పార్టీ జనాలపై రుద్దుతుందని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన బీజేపీ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతోందని, 90 శాతం సంపద బీజేపీ నాయకుల అనుచరుల చేతిలో ఉందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు వర్సిటీల్లోకి దూరి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.

సరిహద్దుల్లో భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తుంటే ఆ విషయం గురించి బీజేపీ నోరెత్తడం లేదని, లోక్‌సభలో తమ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఫోటోలతో సహా చూపించారని పేర్కొన్నారు. అంతేకాదు, గాంధీ కుటుంబం త్యాగానికి మారుపేరని, గాంధీ, నెహ్రూల గురించి బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు అర్పించారని పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం గురించి ప్రస్తావిస్తూ ఈ విషయంలో దుర్మార్గంగా వ్యవహరించారని, అసలు కేసు లేకుండా నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ ఆఫీసర్‍ను ఉరి తీసినా తప్పులేదన్నారు. అంతేకాదు, ఝార్ఖండ్‍లో మాత్రం అంబానీలకు చెందిన వ్యక్తికి సరైన పత్రాలు లేకపోయినా మరోసారి అవకాశం ఇచ్చారని ఆయన ఆరోపించారు. దేవుడు పేరు చెప్పకుండా గెలిచే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఉదయం లేస్తే దేవుడి పేరు జపం చేస్తారన్నారు. లౌకిక వాదం ఉన్న వారి ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.