జూన్ 25 నుంచి ఓటర్ల జాబితా ప్రక్షాళన.
• అక్టోబర్ 1న తుది జాబితా వెల్లడి.
• పారదర్శకంగా ఇంటింటి సర్వే.
• అపోహలకు తావులేదు.
• రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రక్రియకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. జూన్ 15 నుంచి 24వ తేదీ వరకు సన్నాహక కార్యక్రమాలు జరుగుతాయని, అనంతరం జూన్ 25 నుంచి జులై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని వివరించారు. ఈ క్రమంలో ఎవరైనా సర్వేలో మిస్ అయితే, వారికి ఫారం-6 ద్వారా మరోసారి ఎన్యుమరేషన్ ఫారం అందజేసే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని, దానిపై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఓటరు జాబితాలో ఒక వ్యక్తి పేరు ప్రస్తుతం ఏ చిరునామాలో నమోదు చేయబడి ఉందో, కచ్చితంగా ఆ అడ్రస్‌కే ఎన్యుమరేషన్ ఫారం వస్తుందని సీఈఓ తెలిపారు. ఒకవేళ విచారణ సమయంలో ఆ చిరునామాలో సదరు ఓటరు నివాసం ఉండకపోతే, ఆ ప్రాంతం నుంచి ఓటును తొలగిస్తామన్నారు. అయితే, వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న కొత్త అడ్రస్‌లో ఫారం-8ను ఉపయోగించి తిరిగి తమ ఓటును నమోదు చేసుకునే సులభతరమైన అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు.
ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశం కేవలం ఓటర్ల జాబితాను పారదర్శకంగా ప్రక్షాళన చేయడమేనని, అర్హులైన ఓటర్లను తొలగించడం కాదని సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు. గత 24 ఏళ్లుగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో శుద్ధికి నోచుకోలేదని, ఈ సుదీర్ఘ కాలంలో ఎంతోమంది మరణించి ఉంటారని, అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మరికొందరు వలస వెళ్లి ఉంటారని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సవరణలన్నింటినీ సరిదిద్ది కచ్చితమైన జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ సర్వేలో ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కోణం లేదని, ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ ఎన్యుమరేషన్ ఫారం అందజేస్తామని, ఒక వర్గం ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగిస్తారనే అపోహలకు, ఆందోళనలకు ఏమాత్రం తావులేదని ఆయన స్పష్టం చేశారు.








