హైడ్రాపై కావాలనే దుష్ప్రచారం..
* చట్టం అందరికీ ఒకటే!
* ఆస్తుల పరిరక్షణే మా ధ్యేయం.
* ఎవరిపట్లా పక్షపాతం లేదు.
* లక్షా పది వేల కోట్ల ఆస్తులు కాపాడాం.
* హైడ్రా కమిషనర్ రంగనాథ్.
హైదరాబాద్, మహా.
హైడ్రాపై కొందరు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తూ బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తత్వం ఉండాలని, దోపిడీకి గురికాకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని గుర్తుచేశారు. ఇప్పటివరకు హైడ్రా ద్వారా ఏకంగా లక్షా పదివేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడామని, 600 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. హైడ్రా అనేది కేవలం విపత్తు నిర్వహణ కోసం మాత్రమే కాదని, ఆస్తుల పరిరక్షణే దాని ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరిపట్ల పక్షపాతంతో వ్యవహరించబోమని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో తమపై పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
**ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పూర్తి స్వేచ్ఛ**
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించే విషయంలో ప్రభుత్వం హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని రంగనాథ్ పేర్కొన్నారు. తాము రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఫాతిమా కళాశాల తరహాలోనే ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయని, తమ దృష్టిలో ఎంఐఎం, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు సమానమేనని ఉద్ఘాటించారు. హైడ్రా ఎన్నడూ సైలెంట్‌గా ఉండదని, అలాగే రాత్రికి రాత్రే ఇళ్లను కూల్చేస్తుందనేది పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. ఇటీవల గుడిసెలు ఉన్న ప్రాంతానికి స్వయంగా మీడియాను తీసుకెళ్లి చూపించామని, అప్పటికే అక్కడ వంద గుడిసెలు అదనంగా వెలిశాయని, దీని వెనుక కొన్ని అదృశ్య శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. అయితే, గుడిసెలు వేసుకున్న నిరుపేదల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని, వారు నిజమైన బాధితులా కాదా అనేది క్షుణ్ణంగా పరిశీలించి, వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
**లక్షల మందికి మేలు జరిగే క్రమంలో..**
హైడ్రా అంటూ ఒకటి లేకపోతే, నగరంలో ఇప్పుడు కనిపిస్తున్న చెరువులు, కుంటలు కూడా భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యేవని రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 9న కురిసిన భారీ వర్షానికే హైదరాబాద్ నగరం ఎంతలా అతలాకుతలం అయిందో అందరూ చూశారని గుర్తుచేశారు. నగరంలోని లక్షల మంది ప్రజలకు మేలు జరిగే క్రమంలో, అనివార్యంగా కొద్దిమందికి ఇబ్బంది కలగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తమ కార్యకలాపాల్లో హైడ్రా వైపు ఏదైనా తప్పు ఉంటే నిస్సంకోచంగా క్షమాపణలు కోరుతామన్నారు. సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుందని, ఎన్నో కీలక పనులను పూర్తి చేసిందని, ఏవైనా పొరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దుకుంటూ అప్రమత్తంగా ముందుకు సాగుతోందని వివరించారు. హైడ్రా ఎన్నటికీ సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారదని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజల నమ్మకం, విశ్వాసం చూరగొనేలా తమ పనితీరు ఉంటుందని రంగనాథ్ స్పష్టం చేశారు.








