అప్పుల ఊబిలో తమిళనాడు.
* గట్టెక్కేందుకు నిపుణుల కమిటీ వేయాలి!
* శ్వేతపత్రాన్ని సాకుగా చూపొద్దు.
* దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.
* సీఎం విజయ్ ప్రభుత్వానికి ‘వుయ్ ది లీడర్’ వ్యవస్థాపకుడు అన్నామలై సూచన.
చెన్నై, మహా.
తమిళనాడు రాష్ట్రం మునుపెన్నడూ లేనివిధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తక్షణమే ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ఒక ఉన్నతస్థాయి సంప్రదింపుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ‘వుయ్ ది లీడర్’వ్యవస్థాపకుడు కె. అన్నామలై రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ఉటంకిస్తూ ఆయన ఈ కీలక ప్రతిపాదన చేశారు. నివేదికలు విడుదల చేసి చేతులు దులుపుకోకుండా, ఆర్థిక పునరుద్ధరణకు పకడ్బందీ ప్రణాళికలు రచించాలని డిమాండ్ చేశారు.
**రూ.13 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం**
రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై ప్రభుత్వం జూన్ 16న విడుదల చేసిన శ్వేతపత్రం ఎన్నో ఆందోళనకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం, తమిళనాడు రాష్ట్ర ప్రత్యక్ష అప్పులు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలను సైతం పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్రం మొత్తం అప్పుల భారం ఏకంగా రూ.13.18 లక్షల కోట్లుగా ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా, రాష్ట్ర ఖజానాకు వస్తున్న మొత్తం ఆదాయంలో 22.8 శాతం కేవలం అప్పుల వడ్డీలు చెల్లించడానికే సరిపోతోందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. గత ఐదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక దుర్వినియోగానికి, ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు ఈ శ్వేతపత్రం ఒక ‘పోస్ట్‌మార్టమ్’ నివేదిక లాంటిదని శనివారం మీడియాతో మాట్లాడుతూ అన్నామలై తీవ్రస్థాయిలో విమర్శించారు.
**సమయం మించిపోతోంది.. మేల్కోవాలి**
ఈ శ్వేతపత్రాన్ని కేవలం ఒక సాకుగా చూపి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోకూడదని, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు దీనిని ఒక స్పష్టమైన మార్గసూచిగా పరిగణించాలని ఆయన హితవు పలికారు. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా, 2031 నాటికి తమిళనాడులో పనిచేసే వయసున్న జనాభా శాతం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడానికి, అలాగే అప్పుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న గడువు చాలా తక్కువని అన్నామలై స్పష్టం చేశారు.








