భారత్ ధర్మసత్రం కాదు..
* చొరబాటుదారులను తరిమికొడతాం.
* ఓటు బ్యాంకు రాజకీయాలపై ప్రతిపక్షాలకు అమిత్ షా వార్నింగ్.
* కొల్హాపూర్ సభలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేలపై నిప్పులు.
ఢిల్లీ, మహా.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ పార్టీల తీరుపై నిప్పులు చెరిగారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారులను ఆయా పార్టీలు కేవలం తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపించారు. శనివారం కొల్హాపూర్లో ప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
భారతదేశం ఎవరికీ ధర్మసత్రం కాదని అమిత్ షా ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. ఈ దేశంలో జన్మించిన పౌరులకు మాత్రమే ఇక్కడ నివసించే పూర్తి హక్కు ఉంటుందని ఉద్ఘాటించారు. రాజకీయ లబ్ధి కోసం దేశ భద్రతను పణంగా పెడుతూ, చొరబాటుదారులను అక్కున చేర్చుకుంటున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, ఉద్ధవ్ వర్గాలు కేవలం అధికార దాహంతో, ఓట్ల కోసం ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
దేశ భద్రత, సమగ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. దేశ నలుమూలలా దాక్కున్న ప్రతి చొరబాటుదారుడినీ తమ ప్రభుత్వం పక్కాగా గుర్తిస్తుందని, వారిని దేశం నుంచి శాశ్వతంగా తరిమికొడుతుందని హెచ్చరించారు. ఈ దేశంపై హక్కు కేవలం ఇక్కడి పౌరులకేనని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రతిపక్షాలకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.








