Mahaa Daily Exclusive

  తండ్రి ఆత్మగౌరవం కోసం…

Share

తండ్రి ఆత్మగౌరవం కోసం.
* 75 ఏళ్ల వృద్ధుడి ‘లేఖల’ ధర్మయుద్ధం.
* 21 ఏళ్లు.. 5 వేల ఉత్తరాలు.. రూ.2 లక్షల ఖర్చు.
* చనిపోయిన స్వాతంత్య్ర సమరయోధుడికి జరిగిన అన్యాయంపై కొడుకు పోరాటం.
ఢిల్లీ, మహా.
భోపాల్‌కు చెందిన 75 ఏళ్ల సుభాశ్ చంద్ర దూబే నిత్యావసరాలు లేదా తన సొంత ఆస్తుల కోసం కాకుండా.. మరణించిన తన తండ్రి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు గత 21 ఏళ్లుగా ప్రభుత్వ వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దేశం కోసం పోరాడిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడి పట్ల ప్రభుత్వ యంత్రాంగం చూపిన నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆయన ఏకంగా 5,000 లేఖలు రాశారు. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 10 పేజీల సుదీర్ఘ లేఖను పంపుతూ తన ఆవేదనను నివేదించారు. వృద్ధాప్యంలో ఒంటరిగా జీవిస్తున్నప్పటికీ, తన తండ్రి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకురావడమే ధ్యేయంగా ఆయన ఈ ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తున్నారు.
**తామ్ర పత్రంతో సత్కారం.. ఆపై భూమి రద్దు**
సుభాశ్ చంద్ర దూబే తండ్రి రామ్‌లాల్ దూబే దేశ స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఆయన త్యాగానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక ‘తామ్ర పత్రం’ (రాగి ఫలకం), రైల్వే ఫస్ట్ క్లాస్ పాస్‌తో పాటు 10.41 ఎకరాల భూమిని కేటాయించి గౌరవించింది. అయితే, కాలక్రమేణా ఆ భూమి అటవీ ప్రాంత పరిధిలోకి వస్తుందనే నెపంతో ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంది. ఈ అన్యాయంపై రామ్‌లాల్ దూబే తాను బతికున్నంత కాలం పోరాడినా ఫలితం దక్కలేదు. ఆయన మరణానంతరం, స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి అయిన కుమారుడు సుభాశ్ చంద్ర దూబే ఈ పోరాటాన్ని తన భుజానికెత్తుకున్నారు.
**నాకు భూమి వద్దు.. తండ్రి గౌరవమే ముఖ్యం**
గత 21 ఏళ్లుగా రోజువారీ విధిగా సుభాశ్ చంద్ర దూబే వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు లేఖలు రాస్తూనే ఉన్నారు. దేశ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, ఎంపీలు ఇలా వ్యవస్థలోని ప్రతి కీలక అధికారికి ఆయన అర్జీలు పంపారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ సమస్యను పరిష్కరించాలని సిఫార్సు లేఖ ఇచ్చినా అధికారుల్లో చలనం రాలేదు. “నాకు ఆ భూమిపై ఆశ లేదు. నా తర్వాతి తరానికి ఆస్తులు ఇవ్వాలనే కోరికా లేదు. దేశం కోసం పోరాడినందుకు నా తండ్రికి ఇచ్చిన గౌరవాన్ని వెనక్కి తీసుకుని అగౌరవపరిచారు. దానికి ప్రత్యామ్నాయంగా భోపాల్‌లో ఒక చిన్న నివాస స్థలం కేటాయించి ఈ వివాదాన్ని ముగించాలని 2012లోనే అధికారులను కోరాను. వారు మొదట ఒప్పుకున్నా, ఫైల్ మాత్రం ముందుకు కదల్లేదు” అని సుభాశ్ చంద్ర దూబే ఆవేదన వ్యక్తం చేశారు.
**లేఖల ఖర్చుతో ఒక ఫ్లాట్ కొనొచ్చు!**
ప్రస్తుతం భోపాల్‌లోని ఎల్‌ఐజీ ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్న సుభాష్ చంద్ర ఇల్లు నిండా లేఖల బస్తాలు, ఫైళ్లే దర్శనమిస్తాయి. ఈ 21 ఏళ్ల కాలంలో 5 వేల లేఖలను టైప్ చేయించడానికి, రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడానికి ఆయన దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు చేశారు. ఒక సామాన్య మధ్యతరగతి వృద్ధుడికి ఈ మొత్తం చాలా పెద్దదని, ఆ డబ్బుతో స్థానికంగా ఒక చిన్న ప్లాట్ కొనుగోలు చేయవచ్చని పొరుగువారు చెబుతుంటారు. అయినా, తన శరీరంలో ఊపిరి ఉన్నంతవరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని సుభాశ్ చంద్ర స్పష్టం చేశారు. వ్యవస్థ చేసిన పొరపాటును సరిదిద్దుకుని, తన తండ్రి ఆత్మగౌరవాన్ని తిరిగి అప్పగించే వరకు తన కలం విశ్రమించబోదని ఆయన భావోద్వేగంతో తేల్చిచెప్పారు.