Mahaa Daily Exclusive

  మళ్లీ యుద్ధ మేఘాలు…

Share

మళ్లీ యుద్ధ మేఘాలు.
* హోర్ముజ్ జలసంధి మూసివేత.
* లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.
* ఐదుగురు మృతి.
* ఇరాన్‌ ప్రకటనను తోసిపుచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.
ఢిల్లీ, మహా.
పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాలు జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు మరోసారి అత్యంత తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్‌ భూభాగంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామాలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం ‘హోర్ముజ్ జలసంధి’ని తాము అన్ని రకాల నౌకా రవాణాకు పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అయితే, ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలను అగ్రరాజ్యం అమెరికా తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ జలమార్గం గుండా నౌకల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని, జలసంధి తెరిచే ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
లెబనాన్‌లోని నబతియెహ్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడుల ధాటికి అక్కడి పౌరుల నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ వైమానిక దాడుల కారణంగా కనీసం ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పెద్ద సంఖ్యలో స్థానికులు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన ఇరాన్ సైనిక నాయకత్వం.. ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాజా పరిణామాలు తమ తొలి ప్రతిస్పందన మాత్రమేనని, ఇజ్రాయెల్ గనుక తన దూకుడును తగ్గించుకోకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన సైనిక చర్యలు ఉంటాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) హెచ్చరించింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు గుండెకాయ లాంటి హోర్ముజ్ జలసంధి వైపు ఏ నౌకలూ రాకూడదని ఐఆర్‌జీసీ ఆంక్షలు విధించింది. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని మూసివేయడం ద్వారా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను దెబ్బతీయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే, ఇరాన్ హెచ్చరికలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తక్షణమే స్పందించారు. హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆధారాలూ లేవని ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చారు. చమురు మోసుకెళ్లే కార్గో నౌకల ప్రయాణం యథావిధిగా కొనసాగుతోందని, పశ్చిమాసియాలోని తాజా పరిస్థితులను అమెరికా రక్షణ విభాగం అత్యంత నిశితంగా గమనిస్తోందని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ దౌత్యవేత్తలతో తాము నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు జేడీ వాన్స్ వెల్లడించారు.