Mahaa Daily Exclusive

  అమరుల త్యాగాలు చిరస్మరణీయం వారి ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి జూపల్లి

Share

  • షాద్‌నగర్‌లో అమరవీరుల స్థూపం ఆవిష్కరణ

షాద్‌నగర్, మహా : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించే సమాజాన్ని నిర్మించడమే ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నిజమైన నివాళి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో యువకులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. “మా చావులతో తెలంగాణ రావాలి” అనే సంకల్పంతో ఆత్మబలిదానం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయాలను సాకారం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను శాశ్వతంగా గుర్తుంచుకునేలా స్థూపాన్ని ఏర్పాటు చేయడం

అభినందనీయమన్నారు.

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంలో అమరవీరుల స్థూపం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తన కుమారుడి త్యాగాన్ని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం అక్కడి వారిని కదిలించింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ విమల గద్దర్, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.