Mahaa Daily Exclusive

  ట్రూకాలర్‌కు ట్రాయ్ అభ్యంతరం.  ‘ఫ్రీక్వెంట్లీ బ్లాక్‌డ్’ ట్యాగ్‌పై ఆందోళన.

Share

హైదరాబాద్, మహా.

ప్రత్యేక నంబర్ సిరీస్‌లకు ట్రూకాలర్ చూపిస్తున్న ఫ్రీక్వెన్లీ బ్లాక్ ట్యాగ్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా 1600 సిరీస్ నుంచి వచ్చే కాల్స్‌కు ఈ ట్యాగ్ ప్రదర్శించడం వల్ల వినియోగదారులు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ట్రాయ్ పేర్కొంది. ఈ నంబర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, ప్రభుత్వ సేవల నుంచి వచ్చే ముఖ్యమైన సర్వీస్, లావాదేవీ సంబంధిత కాల్స్ కోసం ప్రత్యేకంగా కేటాయించినవని స్పష్టం చేసింది.

కేవలం వినియోగదారులు ఎక్కువగా బ్లాక్ చేశారనే కారణంతో ఒక నంబర్‌ను అనుమానాస్పదంగా చూపించడం సరైన విధానం కాదని ట్రాయ్ అభిప్రాయపడింది. ఒక కాల్ మోసపూరితమా లేదా అనేది కేవలం కస్టమర్ల బ్లాకింగ్ అలవాట్ల ఆధారంగా నిర్ణయించలేమని పేర్కొంది. ఈ తరహా ట్యాగ్‌లు చట్టబద్ధమైన సేవా కాల్స్‌పైనా ప్రజల్లో అనవసర అనుమానాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు ట్రూకాలర్ తన వైఖరిని సమర్థించుకుంది. తాము 1600 లేదా 140 సిరీస్ నంబర్లను ‘స్పామ్’ గా గుర్తించడం లేదని, వినియోగదారులు ఎక్కువగా బ్లాక్ చేసిన నంబర్లకు మాత్రమే ఫ్రీక్వెన్ట్లీ బ్లాక్ ట్యాగ్‌ను చూపిస్తున్నామని వెల్లడించింది. ఇది వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా రూపొందిన సమాచారం మాత్రమేనని, మోసపూరిత కాల్‌గా ముద్ర వేయడం కాదని స్పష్టం చేసింది.

అయితే ట్రాయ్ మాత్రం ఈ వివరణతో ఏకీభవించడం లేదు. 140, 1600 సిరీస్‌లకు ఇలాంటి ట్యాగ్‌లు చూపించడం వల్ల చట్టబద్ధమైన వ్యాపార, బ్యాంకింగ్, ప్రభుత్వ కమ్యూనికేషన్లపై ప్రజల్లో అపోహలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. వాస్తవానికి స్పామ్ కాల్స్‌లో అత్యధికం ఈ ప్రత్యేక నంబర్ సిరీస్‌ల నుంచి కాకుండా సాధారణ మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్ల నుంచే వస్తున్నాయని వెల్లడించింది. మొత్తం అనవసర మార్కెటింగ్ కాల్స్‌లో 80 శాతానికి పైగా సాధారణ నంబర్ల నుంచే వస్తున్నాయని ట్రాయ్ వివరించింది.

టెలికాం సంస్థలు ఇప్పటికే కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలతో ప్రతిరోజూ కోట్లాది అనుమానాస్పద కాల్స్‌ను గుర్తించి నియంత్రిస్తున్నాయని ట్రాయ్ తెలిపింది. అదేవిధంగా ప్రమోషనల్ కాల్స్‌ను నియంత్రించేందుకు డూ నాట్ డిస్టర్బ్ సేవ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక నంబర్ సిరీస్‌లను ప్రతికూలంగా చూపించే ట్యాగ్‌ల అవసరం లేదని ట్రాయ్ స్పష్టం చేసింది.