Mahaa Daily Exclusive

  స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.

Share

  •  పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం.
  •  అభ్యర్థుల ఖరారుపై అధిష్టానమే నిర్ణయం.
  • సీఎం చంద్రబాబు నాయుడు.

అమరావతి, మహా.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహం, పార్టీ బలోపేతంపై సమీక్ష నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, పార్టీ యంత్రాంగంతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించే అవకాశముందని చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ప్రస్తుతం ఎలాంటి చర్చలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై కూటమి పార్టీల అగ్ర నాయకత్వం పరస్పర చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

స్థానిక సంస్థల్లో సీట్ల పంపకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అనవసర చర్చలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. అలాంటి వ్యాఖ్యలు కూటమి ఐక్యతకు భంగం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. ఈ అంశాన్ని పూర్తిగా పార్టీ అధిష్టానాలకే వదిలేయాలని సూచించారు.

కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి ప్రయత్నాలకు తావివ్వకుండా అన్ని కూటమి పార్టీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో శ్రమించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో శాతం శాతం విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.