- లైంగిక వేధింపుల ఆరోపణలు
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
- ఆస్పత్రిలో చేర్చిన బంధువులు
హైదరాబాద్, మహా : నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్ పీఏ) లో లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తోటి మహిళా అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ఆయనను ఎస్ఆర్ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసినట్లు సమాచారం.
రాజేంద్రనగర్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఉదయ్ కృష్ణారెడ్డి తనను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు జూన్ 23 నుంచి తనకు అసభ్యకర మెసేజ్‌లు పంపాడని పేర్కొన్నారు. ఆపై జూలై 8న గదిలోకి లాకెళ్లి ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని బెదిరించాడని.. జూలై 9న గదిలో బంధించి, జుట్టు పట్టుకుని దాడి చేసి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని ఆరోపించారు. జూలై 10న తన ప్రైవేట్ వీడియోలు తీసి, వాటిని తన భర్తకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు శనివారం ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74, 75, 77, 315(2)తో పాటు ఐటీ చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గతంలోనూ సహచర ఐపీఎస్‌లతో అమర్యాదగా ప్రవర్తించేవాడని, వాట్సప్ గ్రూపుల ద్వారా కొందరిని వేధించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
సస్పెన్షన్ వేటు వేసిన పోలీస్ అకాడమీ
ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డిని నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేసి అకాడమీ నుండి పంపించివేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ప్రివిలేజ్ కమిటీ.. సీసీటీవీ దృశ్యాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించి విచారించిన అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించి ఈ తక్షణ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. అయితే, భవిష్యత్తులో ఆయన సర్వీసులో చేరడానికి సంబంధించిన తుది నిర్ణయం మాత్రం కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ పరిధిలోనే ఉంటుందని ఎన్ పీఏ అధికారులు స్పష్టం చేశారు.
ఎంతో మందికి స్పూర్తి దాయకంగా నిలిచి…
నిన్నటివరకూ ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి
ఏపీలోని ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్ద పెరిగాడు. కూరగాయలు అమ్ముతూ ఆమెకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఈ క్రమంలో ఉమ్మడి ఏపీలో చివరి నోటిఫికేషన్ 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. కొన్నేళ్లపాటు కానిస్టేబుల్ గా సేవలు అందించారు. ఈ క్రమంలో ఉన్నత అధికారి చేసిన అవమానంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేశారు. నాలుగు పర్యాయాలు ఫెయిల్ అయినా కుంగిపోలేదు. కచ్చితంగా విజయం సాధిస్తానని నమ్మిన ఆయన ఐదో ప్రయత్నంలో 360వ ర్యాంకుతో సివిల్స్ సాధించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి తెలుగు రాష్ట్రాల వారితో పాటు దేశంలోని చాలా మంది యువతగా ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌గా శిక్షణ పొందుతున్నారు. త్వరలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న ఈ సమయంలో పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.








