Mahaa Daily Exclusive

  ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలపై సీఈవోకు బీజేపీ ఫిర్యాదు….

Share

హైదరాబాద్, మహా.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు, అర్హులైన ఓటర్ల నమోదు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ను కలిసి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లపై బెదిరింపులు, ఓటరు నమోదు ప్రక్రియకు ఆటంకాలు, బూత్ లెవల్ అధికారులపై (బీఎల్‌ఓలు) రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని పేర్కొంటూ సమగ్ర నివేదికను సీఈవోకు సమర్పించింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 3తో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఆ సందర్భంగా అనేక ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు.

హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తుల కారణంగా స్థిరపడిన వేలాది మంది నివసిస్తున్నారని రాంచందర్ రావు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భారతదేశ పౌరుడు తాను శాశ్వతంగా నివసిస్తున్న ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునే పూర్తి హక్కు కలిగి ఉంటాడని, అయితే ఒకే వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు ఉండాలని చట్టం స్పష్టం చేస్తోందన్నారు.

అయితే అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు కాకుండా కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఎల్‌ఓలపై ఒత్తిళ్లు తీసుకొస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దీంతో అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు కాకుండా చేస్తున్నారని విమర్శించారు.

తాను స్వయంగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలను పరిశీలించానని రాంచందర్ రావు తెలిపారు. అక్కడ అర్హులైన ఓటర్లను తప్పుదోవ పట్టించడం, నమోదు ప్రక్రియకు ఆటంకాలు కల్పించడం వంటి సంఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే మల్కాజిగిరి, చేవెళ్ల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ఉత్తర భారతీయులు, ఐటీ ఉద్యోగులు ఇక్కడే ఓటు నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నప్పటికీ, వారి పేర్లు జాబితాలో నమోదు కాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగులైన బీఎల్‌ఓలపై రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో నివసిస్తే ఇక్కడే ఓటు నమోదు చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని, ఆ హక్కును ఎవరూ కాలరాయలేరని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో బీజేపీకి అనుకూలంగా ఉండే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కాకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాంచందర్ రావు ఆరోపించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ఓటు నమోదు ప్రక్రియలో ఎక్కడైనా ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమాలు ఎదురైతే వెంటనే బీజేపీ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ సందర్భంగా మరో కీలక అంశాన్ని కూడా బీజేపీ ప్రతినిధి బృందం సీఈవో దృష్టికి తీసుకెళ్లింది. 2025 నుంచి బూత్ లెవల్ అధికారులకు చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, వాటిని వెంటనే విడుదల చేసి బీఎల్‌ఓలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో బీఎల్‌ఓలు కీలక పాత్ర పోషిస్తున్నందున వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

తమ వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో వచ్చిన అన్ని ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వెల్లడించారు.