Mahaa Daily Exclusive

  ఈనెల 26న తెలంగాణకు అమిత్ షా…

Share

ఈనెల 26న తెలంగాణకు అమిత్ షా.
* కరీంనగర్‌లో పర్యటన, రాష్ట్ర నేతలతో కీలక భేటీ
హైదరాబాద్, మహా.
కేంద్ర హోంశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్‌లో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించిన కమలనాథులకు కేంద్ర హోంమంత్రి తాజా పర్యటన అత్యంత కీలకం కానుంది.
కరీంనగర్ పర్యటనలో భాగంగా స్థానికంగా జరిగే ఒక ప్రైవేట్ వేడుకలో అమిత్ షా పాల్గొంటారు. దేశ హోంమంత్రి రాక నేపథ్యంలో కరీంనగర్‌లో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ పర్యటన కావడంతో భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ఆయన రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అమిత్ షా రాకకు ముందే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ నితిన్ నబీన్ తదితర అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రంలో పార్టీ కార్యాచరణను అధిష్ఠానం మరింత వేగవంతం చేసింది.
మరోవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తదితర కీలక నేతలతో అధిష్ఠానం ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ సమన్వయం చేసుకుంటోంది.