- దళిత–గిరిజన గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
- సబ్ ప్లాన్ నిధులను విడుదల చేయాలి – వ్యకాస
కారేపల్లి , మహా: దళిత, గిరిజన ఆవాస ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.వ్యకాస ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి మండలం లోని దళిత, గిరిజన ఆవాస ప్రాంతాల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈసర్వేలో వెలికి వచ్చి సమస్యలను కొండబోయిన నాగేశ్వరరావు వివరించారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, గృహాలు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందన్నారు. భూమిలేని వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ చట్టం సవరణ, నిధులలో కోతతో జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని భయాందోళన చెందుతున్నారన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల చట్టం అమలులో ఉందన్నారు. చట్టం లక్ష్యం ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయటమే నన్నారు. దాని కోసం జిల్లా లో ఐటీడీఏ ను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం కేటాయించిన నిధులను జాప్యం లేకుండా విడుదల చేసి దళిత, గిరిజన ప్రాంతాల అభివృద్ధికే వినియోగించాలన్నారు. అంతోదయ అన్నపూర్ణ కార్డు లబ్ధిదారులుగా పేద దళిత గిరిజనులు అత్యధిక మంది ఉన్నారని 35 కిలోల బియ్యం అందించే ఈ కార్డులు రద్దు చేయడం వల్ల వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేంద్రం అంతోదయ కార్డుల రద్దు ప్రయత్నం విరమించుకోవాలన్నారు. ఇందిరమ్మ మొదటి విడత లో ఇల్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు చివరి బిల్లులు నేటికీ విడుదల కాలేదని, కేంద్రం ఎన్ఆర్ఈజీ ఎస్ కింద ఇచ్చే రూ. 60 వేలు వెంటనే విడుదల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, ఇల్లు, ఇళ్ల స్థలాలు, పోడుహక్కుల ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సర్వేలో గుర్తించిన సమస్యలను పరిష్కారం కోసం అధికారులు దృష్టికి తీసుకవెళ్ళనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో వ్యకాస నాయకులు బాలు, తులిశ్యా తదితరులు పాల్గొన్నారు.








