Mahaa Daily Exclusive

  ఆరోపణలకు అతీతం – ఆచరణలో అద్భుతం.

Share

ఆరోపణలకు అతీతం – ఆచరణలో అద్భుతం.
(శివకుమార్ గనివాడ, సీనియర్ సామాజిక విశ్లేషకులు)
భారతదేశ సామాజిక, సాంస్కృతిక, జాతీయ జీవనంలో ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ ఒక సువర్ణ అధ్యాయం. 1925 విజయదశమి రోజున డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ గారి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ సంస్థ, నేడు వందేళ్ల చారిత్రక ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటోంది. 1947 దేశ విభజన సమయంలో శరణార్థులకు అండగా నిలవడం నుండి, నాటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక ఆహ్వానం మేరకు 1963 గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో పాల్గొనడం, అలాగే 1975 ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకై అసమాన పోరాటం చేయడం వరకు.. ఆరెస్సెస్ జాతి నిర్మాణంలో ఒక మహా గంగా ప్రవాహంగా నిలబడింది. శతాబ్ది కాలంలో సమాజంలోని ప్రతి రంగాన్ని స్పృశిస్తూ ‘సంఘ్ పరివార్’గా విస్తరించిన ఈ నెట్‌వర్క్ ప్రపంచ సంస్థాగత చరిత్రలోనే ఒక అద్భుతం. అయితే, ఇంత పెద్ద వ్యవస్థను నడుపుతున్న ఆరెస్సెస్ ఎందుకు రిజిస్టర్ కాలేదు, అది చట్టవిరుద్ధమా అని కొందరు తరచూ ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి నిరాధారమైన సందేహాలను, భావోద్వేగాలను పక్కనపెట్టి, రాజ్యాంగం, చట్టాలు, సంస్థాగత వ్యూహాల ఆధారంగా వాస్తవాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
ఆరెస్సెస్ కేవలం ఒక సంస్థ కాదు, అదొక సువిశాల ఆలోచనా విధానం, ఒక సాంస్కృతిక జాతీయవాద ప్రవాహం. ఈ మూల వృక్షం నుండి పుట్టుకొచ్చిన శాఖలే ‘సంఘ్ పరివార్’. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా, ప్రతి అంగానికి ఒక నిర్దిష్ట వేదికను ఏర్పాటు చేసి నిస్వార్థంగా పనిచేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకమైన రాజకీయ రంగంలో జాతీయవాద భావజాలంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పనిచేస్తుండగా, విద్యార్థులలో జాతీయ భావాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా అవతరించింది. అలాగే ధర్మ రక్షణకై బజరంగ్ దళ్, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు దుర్గా వాహిని విశేష కృషి చేస్తున్నాయి. విద్యా రంగంలో చూస్తే, ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు విస్తరించిన అతిపెద్ద ప్రైవేట్ పాఠశాలల నెట్‌వర్క్ ‘విద్యా భారతి’ నైతిక విలువలతో కూడిన ఆధునిక విద్యను అందిస్తోంది. జాతీయవాద మేధావుల కోసం ప్రజ్ఞా ప్రవాహ్, వక్రీకరణలకు గురైన చరిత్రను శాస్త్రీయంగా సరిదిద్దేందుకు ఇతిహాస్ సంకలన్ యోజన, విద్యాభివృద్ధికై ఆర్ష విద్యా సమాజ్, పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా పూర్వ ఛాత్ర పరిషత్ వంటివి నిరంతరం శ్రమిస్తున్నాయి.
సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సేవా భారతి మురికివాడల్లో సేవలందిస్తుండగా, వనవాసి కల్యాణ్ ఆశ్రమం మారుమూల అటవీ ప్రాంతాల్లో గిరిజనుల విద్య, వైద్యం కోసం దశాబ్దాలుగా పనిచేస్తోంది. దివ్యాంగుల సాధికారతకు సక్షమ్, మాజీ సైనికుల సంక్షేమానికి పూర్వ సైనిక్ సేవా పరిషత్, సామాజిక చైతన్యానికి వివేకానంద కేంద్ర, రాష్ట్రోత్థాన పరిషత్, భారత్ వికాస్ పరిషత్ వంటి సంస్థలు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు ఆర్థిక, కార్మిక, వ్యవసాయ రంగాల్లో సైతం సంఘ్ పరివార్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. వర్గపోరాటానికి బదులు జాతీయ శ్రేయస్సే ధ్యేయంగా భారతీయ మజ్దూర్ సంఘ్ అతిపెద్ద కార్మిక సంఘంగా ఎదిగింది. రైతుల హక్కుల కోసం భారతీయ కిసాన్ సంఘ్, ఆర్థిక స్వయం సమృద్ధి కోసం స్వదేశీ జాగరణ్ మంచ్, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి లఘు ఉద్యోగ్ భారతి, వినియోగదారుల హక్కులకై అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ అహర్నిశలు శ్రమిస్తున్నాయి.
భారతీయ వారసత్వ సంపదను, ధర్మాన్ని కాపాడేందుకు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుండగా, కళాకారుల కోసం సంస్కార్ భారతి, ప్రాచీన సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి, ధార్మిక అవగాహనకై ధర్మ జాగరణ్ సమితి విశేష కృషి చేస్తున్నాయి. సాహిత్య రంగంలో అఖిల భారతీయ సాహిత్య పరిషత్, విజ్ఞాన రంగంలో ఆధునికతను ప్రాచీనతతో మేళవించే విజ్ఞాన భారతి తమదైన ముద్ర వేశాయి. మహిళల్లో నాయకత్వ లక్షణాల కోసం రాష్ట్ర సేవికా సమితి, విచ్ఛిన్నమవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు కుటుంబ ప్రబోధన్ సమాజాన్ని మేల్కొల్పుతున్నాయి. ఆరోగ్య రంగంలో యోగా, ఆయుర్వేదాల కోసం ఆరోగ్య భారతి, గ్రామీణ వైద్య సేవలకై నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, న్యాయ నిపుణుల కోసం అధివక్త పరిషత్, క్రీడా స్ఫూర్తికి క్రీడా భారతి వంటివి ఉద్భవించాయి. దేశ సరిహద్దులు దాటి, విదేశాల్లోని భారతీయులను ఏకం చేసేందుకు హిందూ స్వయంసేవక్ సంఘ్, ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో సేవలందించేందుకు సేవా ఇంటర్నేషనల్ వంటి వేదికలు విస్తరించాయి.
సమాజంలోని ఇన్ని రంగాల్లో ఇంత శక్తివంతంగా పనిచేస్తున్న ఈ మూల సంస్థ ఎందుకు రిజిస్టర్ కాలేదు అన్న ప్రశ్నకు భారత రాజ్యాంగంలోనే స్పష్టమైన సమాధానం ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(c) దేశంలోని ప్రతి పౌరుడికి సంఘాలు లేదా సంస్థలు ఏర్పాటు చేసుకునే ప్రాథమిక హక్కును ప్రసాదించింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నమోదు కావాలనేది కేవలం ఒక చట్టపరమైన అవకాశం మాత్రమే కానీ, రాజ్యాంగపరంగా అది తప్పనిసరి నిబంధన ఏమాత్రం కాదు. ఆరెస్సెస్ అనేది స్వచ్ఛంద కార్యకర్తలతో నడిచే ఒక అద్భుతమైన సామాజిక-సాంస్కృతిక ఉద్యమం. చట్టపరమైన పరిభాషలో దీనిని ‘బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్’ (స్వచ్ఛంద వ్యక్తుల సమూహం) అని అంటారు. దీనికి రుసుముతో కూడిన సభ్యత్వం ఉండదు, అధికారిక గుర్తింపు కార్డులు ఉండవు. దేశభక్తికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని, నిస్వార్థ సేవ చేయడానికి ఐడీ కార్డులు అవసరం లేదన్నదే ఆరెస్సెస్ ప్రాథమిక సిద్ధాంతం. ప్రభుత్వ నిధులు, గ్రాంట్లు ఆశించని ఏ సేవా సమూహమైనా రిజిస్ట్రేషన్ లేకుండానే రాజ్యాంగబద్ధంగా పనిచేయవచ్చు. వందేళ్లుగా ఈ స్వేచ్ఛను ఆరెస్సెస్ పూర్తి పారదర్శకతతో సద్వినియోగం చేసుకుంటోంది.
చట్టపరంగా ఒక సంస్థ రిజిస్టర్ కాకపోతే తన పేరు మీద ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండలేదనేది వాస్తవం. సరిగ్గా ఇక్కడే ఆరెస్సెస్ సంస్థాగత మేధస్సు, జవాబుదారీతనం ఇనుమడింపజేసే వ్యూహం ద్యోతకమవుతుంది. ఆరెస్సెస్ మూల సంస్థ నేరుగా ఏ ఆస్తినీ, బ్యాంకు ఖాతాలనూ తన ఆధీనంలో ఉంచుకోదు, దాని ఏకైక ఆస్తి నిస్వార్థ స్వయంసేవకులు మాత్రమే. కానీ దేశవ్యాప్తంగా నడిచే వేలాది పాఠశాలలు, ఆసుపత్రులు, సేవా కేంద్రాల నిర్వహణ కోసం ‘సంఘ్ పరివార్’ అనుబంధ సంస్థలను అది చట్టబద్ధంగా రిజిస్టర్ చేసింది. విద్యా భారతి, సేవా భారతి వంటి సేవా సంస్థలన్నీ చట్టబద్ధంగా నమోదైన ట్రస్టులు లేదా సొసైటీలుగా పనిచేస్తూ పక్కాగా బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తాయి, ప్రతి రూపాయినీ ఆడిట్ చేయించి ఆదాయపు పన్ను శాఖకు పారదర్శకంగా లెక్కలు చూపుతాయి. అలాగే రాజకీయ వేదికైన బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద, విశ్వ హిందూ పరిషత్ సంబంధిత చట్టాల కింద పక్కాగా నమోదైన సంస్థలే.
కాబట్టి ఆరెస్సెస్ రిజిస్టర్ కాలేదు కాబట్టి చట్టవిరుద్ధం అనడం కేవలం అవగాహన లోపమే. ఒకవైపు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను గౌరవిస్తూనే, మరోవైపు సమాజంలోని ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ఆరెస్సెస్ నిర్మించిన ఈ వ్యవస్థాగత చట్రం నిజంగా ఒక నిశ్శబ్ద విప్లవం. ఆస్తుల కోసం కాకుండా ఆదర్శాల కోసం, స్వార్థం కోసం కాకుండా పరమార్థం కోసం పనిచేసే ఇలాంటి వ్యవస్థ ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. ఈ వందేళ్ల స్ఫూర్తిదాయక ప్రస్థానమే దీనికి నిలువెత్తు నిదర్శనం.
భారత్ మాతా కీ జై.