మోదీ పాలనలో భారత్ రక్షణ రంగంలో ప్రపంచ శక్తిగా ఎదిగింది.
* మాజీ సైనికులు సమాజ సేవలోనూ ముందుండాలి.
* బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు.
హైదరాబాద్, మహా.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని గత 12 ఏళ్ల పాలనలో భారతదేశం రక్షణ రంగంలో గణనీయమైన పురోగతి సాధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులు పదవీ విరమణ అనంతరం కూడా సమాజంలో అవినీతి, అన్యాయాలపై పోరాడుతూ దేశసేవను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో తొలిసారిగా ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్‌ను ప్రతి జిల్లాలో కన్వీనర్లతో బలోపేతం చేసి, పార్టీకి అత్యంత చురుకైన విభాగంగా తీర్చిదిద్దడం సంతోషకరమని రాంచందర్‌రావు అన్నారు. న్యాయవాదులకు లీగల్ సెల్, కార్మికులకు లేబర్ సెల్ ఉన్నట్లే, మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్లలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ బోర్డులు సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు, మాజీ సైనికుల సంక్షేమం, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ విభాగం చొరవ చూపాలని కోరారు.
జూలై 26న నిర్వహించనున్న కార్గిల్ విజయ్ దివస్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణత్యాగాలకు వెనుకాడకుండా దేశాన్ని రక్షించిన సైనికుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలో సాధించిన చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సైనికులతో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేశారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అంశంపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్‌ను కలిసిన సందర్భంగా సరిహద్దుల్లో తీవ్రమైన వేడిలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు జీతాలు లేదా పెన్షన్లు పెంచాలని కాకుండా, తమ రేషన్‌లో కేవలం అర కిలో ఉల్లిగడ్డలు అదనంగా ఇవ్వాలని మాత్రమే కోరారని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశసేవ, విధినిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చే సైనికుల త్యాగం దేశానికి ఆదర్శమని కొనియాడారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని రాంచందర్‌రావు పేర్కొన్నారు. 2014లో రూ.686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ప్రస్తుతం రూ.38,400 కోట్లకు పెరిగాయని తెలిపారు. అలాగే రక్షణ బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.8 లక్షల కోట్లకు, రక్షణ ఉత్పత్తుల విలువ రూ.46 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఆర్డినెన్స్ స్వయం సమృద్ధి 32 శాతం నుంచి 90 శాతానికి చేరుకుందని, నేవీ, కోస్ట్‌గార్డ్ నౌకల్లో 97 శాతం స్వదేశీ పరికరాలనే వినియోగిస్తున్నామని వివరించారు.
తేజస్ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి స్వదేశీ రక్షణ ఉత్పత్తులు భారత సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్న ఆయన, గతంలో ఉగ్రవాదంపై చర్చలకే పరిమితమైన భారత్ ఇప్పుడు ఉరి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ వంటి చర్యల ద్వారా ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించిందన్నారు. “చర్చలు కాదు.. చర్యలే” అనే విధానంతో దేశ భద్రతను మరింత బలోపేతం చేశామని చెప్పారు.
సైన్యంలో యూనిఫాం ధరించి దేశాన్ని రక్షించిన మాజీ జవాన్లు, రిటైర్మెంట్ అనంతరం కూడా సమాజంలోని అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై పోరాడి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. సైనిక క్రమశిక్షణ, దేశభక్తితో పార్టీ బలోపేతానికి కృషి చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు.








