- కార్యకర్తలకు మరింత స్పష్టత ఇచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి
- త్వరలోనే కేటీఆర్ ను కలుస్తానని వెల్లడి
- కేటీఆర్ జన్మ దిన వేడుకల్లో పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
హైదరాబాద్, మహా : మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మల్లన్న బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పబోతున్నారని టాక్ బాగా వినిపిస్తోంది.. ఆయన ఎక్కడా స్పందించకపోవడంతో సొంత పార్టీకి చెందిన కార్యకర్త రక్తంతో లేఖ పంపడం చర్చనీయాంశమయ్యింది. ఈ తాజా పరిణామాలపై మల్లారెడ్డి ఎట్టకేలకు స్పందించారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు నాడే పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ బర్త్ డే వేడుకల్లో పాల్గొని పార్టీ కేడర్‌లో జోష్ నింపారు. పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు మల్లన్న తాను ఏ పార్టీలోకీ వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.
తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. చివరివరకు బీఆర్ఎస్లోనే ఉంటానని.. కొంతమంది ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. ఎవరూ నమ్మొద్దన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిజం అనుకుని ఓ అభిమాని రక్తంతో లేఖ పంపడం చూసి బాధపడ్డానని చెప్పారు. లేఖ రాసిన కార్యకర్త ఎవరో తెలుసుకుని త్వరలోనే స్వయంగా కలిసి మాట్లాడతానన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన్ను సీఎం కుర్చీలో చూడటమే తన లక్ష్యమన్నారు.
మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారంతో.. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్త రక్తంతో పంపిన లేఖ వైరల్ అయ్యింది. మల్లారెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని.. లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారని కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల్ని విస్మరించడం సరికాదని.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్న మల్లారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ కార్యక్రమాల వేదికలపై మల్లారెడ్డి కనిపించడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు.
మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల్ని తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు, కేడర్‌కు అండగా ఉండాల్సింది పోయి దూరంగా ఉండటం పార్టీకి నష్టమన్నారు. పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తలను మరచిపోయిన నేతలు చరిత్రలో కనుమరుగైపోవడం ఖాయమన్నారు. పార్టీపై ప్రేమతో లేఖ రాస్తున్నానని.. ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఒక కార్యకర్తగా మనసులో బాధను చెబుతున్నాను అన్నారు. మొత్తానికి మల్లారెడ్డి పార్టీ మార్పు ప్రచారానికి ఎండ్ కార్డ్ వేశారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని మరోసారి తేల్చి చెప్పారు.








