ఆలేరు, మహా.
రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, తాగునీటి సరఫరా, రైతు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం మండలం సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి సబ్‌స్టేషన్ రికార్డులను పరిశీలించారు. లాగ్‌బుక్‌ను తనిఖీ చేసిన అనంతరం రైతులకు రోజుకు కేవలం 12 గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
సబ్‌స్టేషన్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్న హరీశ్ రావు, ఇటీవల వరకు 14 నుంచి 15 గంటల పాటు విద్యుత్ అందించామని, అయితే ఈ వారం నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 12 గంటలకు పరిమితం చేస్తున్నట్లు సిబ్బంది వెల్లడించారని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న 12 గంటల సరఫరాలోనూ పలుమార్లు ట్రిప్పింగ్ జరుగుతోందని, దీంతో నారుమళ్ల తయారీ, నాట్లు వేసే కీలక సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కరెంట్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని హరీశ్ రావు అన్నారు. రైతులు విద్యుత్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వ వైఫల్యమే కారణమని వ్యాఖ్యానించారు. ఒకవైపు కరెంట్ కోతలు లేవని ప్రకటిస్తూ, మరోవైపు రికార్డుల్లో 12 గంటల సరఫరానే నమోదవుతోందని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో రైతులకు నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, పొలాలకు సాగునీరు అందించామని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం అదే వ్యవస్థను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంతోనే మిషన్ భగీరథ నిర్వహణను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు మళ్లీ బిందెలతో నీటి కోసం తిరిగే పరిస్థితి రావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 1,600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 270 మెగావాట్ల యూనిట్ నెలలుగా నిలిచిపోయాయని, మొత్తంగా 1,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సింగరేణి ద్వారా బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడం వెనుక కారణాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆదాయం రాదనే ఉద్దేశంతోనే విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి, రైతులపై కోతల భారం మోపుతున్నారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 23 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసి అప్పగించిందని, ప్రస్తుతం లోడ్ తక్కువగా ఉన్నా రైతులకు సరిపడా విద్యుత్ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని హరీశ్ రావు విమర్శించారు. హైదరాబాద్‌కు 24 గంటల విద్యుత్ అందుతున్నట్లే గ్రామీణ రైతులకు కూడా నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందించడమే బీఆర్ఎస్ విధానమని స్పష్టం చేశారు.
రైతు సంక్షేమ పథకాల అమలులోనూ ప్రభుత్వం వెనుకబడిందని ఆయన ఆరోపించారు. రైతు బంధు, రుణమాఫీ హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు రైతు బీమా చెల్లింపులనూ నిలిపివేసిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు వేల మంది మృతిచెందిన రైతుల కుటుంబాలకు అందాల్సిన రూ.5 లక్షల రైతు బీమా సాయం ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఒక్క బొమ్మలరామారం మండలంలోనే పది రైతు బీమా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించిందా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేసి, పెండింగ్‌లో ఉన్న రైతు బీమా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై అత్యవసర సమీక్ష నిర్వహించి ప్రజలకు ప్రతిరోజూ నీటి సరఫరా పునరుద్ధరించాలని, అలాగే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల్లో నిలిచిపోయిన 1,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే ప్రారంభించి రైతులకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు.








