ఢిల్లీ, మహా.
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించడంతో ఆయన పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకోగా, ఫిడే చార్టర్ నిబంధనల ప్రకారం ఉపాధ్యక్షుడిగా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామం ప్రపంచ చెస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సంబంధాలున్న పలువురు ప్రముఖులపై యూరోపియన్ యూనియన్ తాజాగా ఆంక్షలు ప్రకటించింది. ఆ జాబితాలో రష్యా మాజీ ఉప ప్రధాని, ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్ పేరు కూడా ఉండటంతో ఆయన తన బాధ్యతల నుంచి తాత్కాలికంగా వైదొలగాలని నిర్ణయించారు. 2018 నుంచి ఫిడే అధ్యక్షుడిగా కొనసాగుతున్న ద్వోర్కోవిచ్ స్థానంలో ఇప్పుడు ఆనంద్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన విశ్వనాథన్ ఆనంద్, ఫిడే స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అర్కాడీ ద్వోర్కోవిచ్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ఫిడే చార్టర్ ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఫిడే కౌన్సిల్, పరిపాలనా బృందం, సభ్య దేశాల చెస్ సమాఖ్యలతో సమన్వయం చేసుకుంటూ సంస్థ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా కృషి చేస్తానని చెప్పారు.
ద్వోర్కోవిచ్ ఫిడేకు బలమైన పరిపాలనా వ్యవస్థను, స్పష్టమైన కార్యాచరణను అందించారని ఆనంద్ కొనియాడారు. ఆయన ప్రారంభించిన అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచ చెస్ అభివృద్ధి, పారదర్శక పరిపాలన, సభ్య దేశాల మధ్య సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిడే కార్యకలాపాలను కొనసాగిస్తానని ఆనంద్ తన సందేశంలో స్పష్టం చేశారు.








