ఢిల్లీ, మహా.
జాతీయ గేయం ‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న రక్షణల తరహాలోనే వందేమాతరం గేయాన్ని అవమానించడం, ఆలాపనను అడ్డుకోవడం వంటి చర్యలను శిక్షార్హ నేరాలుగా పరిగణించేలా కేంద్రం రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టింది. అయితే బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో వాగ్వాదం చోటుచేసుకోగా, చర్చ పూర్తికాకుండానే సభను సోమవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్–1971లో సవరణలు ప్రతిపాదిస్తూ, వందేమాతరం గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ఆలాపనను అడ్డుకోవడం లేదా గేయం పాడుతున్న సమయంలో అంతరాయం కలిగించడం వంటి చర్యలను నేరాలుగా గుర్తించే నిబంధనలను బిల్లులో చేర్చారు. ఈ నిబంధనల ప్రకారం అలాంటి చర్యలకు జైలు శిక్షతో పాటు ఇతర శిక్షలు విధించే అవకాశం ఉంటుంది.
అయితే బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా బిల్లులోని నిబంధనలు ఉన్నాయని అభిప్రాయపడ్డాయి. చట్టంలోని కొన్ని అంశాలు వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేసే ప్రమాదం ఉందని సభ్యులు పేర్కొన్నారు.
ఈ అంశంపై సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బిల్లును పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ గీతం, జాతీయ గేయానికి సంబంధించిన ప్రస్తుత రాజ్యాంగ నిబంధనలకు ఈ బిల్లు విరుద్ధంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరంలో వందేమాతరం గేయం పోషించిన పాత్ర చారిత్రకమని గుర్తుచేస్తూనే, దేశభక్తి మరియు వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఉన్న సున్నితమైన సమతౌల్యాన్ని దెబ్బతీయకుండా చట్టాలను రూపొందించాలని సూచించారు.
మరోవైపు బీజేపీ ఈ బిల్లును సమర్థించింది. రాజ్యసభ సభ్యుడు సంజయ్ సేథ్ మాట్లాడుతూ, గతంలో వందేమాతరం గేయంలోని కొన్ని చరణాలను మాత్రమే ఆలపించే ఆనవాయితీ ఉండేదని, ప్రస్తుతం పూర్తి గేయాన్ని ఆలపించే సంప్రదాయం కొనసాగుతోందన్నారు. జాతీయ గేయానికి తగిన గౌరవం కల్పించడం దేశ పౌరులందరి బాధ్యత అని, అదే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు.








