Mahaa Daily Exclusive

  క్వాంటమ్ హబ్‌గా అమరావతి. భారత్‌కు గేట్‌వే. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

Share

అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా, అమరావతిని భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తుకు ముఖద్వారంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాత క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ ‘క్వాంటినమ్’తో భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో పరిశోధన, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ప్రపంచ ప్రముఖ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ ‘క్వాంటినమ్’ సీఈవో డాక్టర్ రాజీబ్ హజ్రా, ఆయన బృందంతో ఇటీవల జరిగిన సమావేశంపై శుక్రవారం సామాజిక మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం ద్వారా దేశ క్వాంటమ్ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేయాలనే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన సమగ్ర ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. పరిశోధన, అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ హార్డ్‌వేర్, సప్లై చైన్, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌ల ప్రోత్సాహం, వాణిజ్యీకరణ వంటి అన్ని కీలక రంగాలను సమన్వయం చేస్తూ సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.

“భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తుకు అమరావతి వేగంగా ముఖద్వారంగా మారుతోంది. ప్రపంచ ప్రముఖ ఆవిష్కర్తలు ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం అవుతుండగా, భవిష్యత్ తరాల క్వాంటమ్ సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు అమరావతి కేంద్రంగా ఎదుగుతోంది” అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

క్వాంటినమ్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా అమరావతిని హైటెక్, డీప్‌టెక్ రంగాల్లో కీలక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భవిష్యత్ సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పరిశోధన కార్యకలాపాలకు కొత్త ఊతం లభించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.