Mahaa Daily Exclusive

  విద్యార్థులతో సీఎం చంద్రబాబు, లోకేష్ సహపంక్తి భోజనం…

Share

 

రంపచోడవరం,మహా.
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్న సీఎం, పోషకాహార లోపం నివారణకు మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మెగా పీటీఎం కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానిక ప్రభుత్వ పాఠశాల భోజనశాలలో విద్యార్థులతో కలిసి కూర్చున్న ముఖ్యమంత్రి, “భోజనం ఎలా ఉంది.. రుచిగా ఉందా?” అంటూ విద్యార్థులతో ముచ్చటించారు. అందిస్తున్న ఆహారం నాణ్యత, మెనూ, పోషక విలువలపై వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అధికారులతో మాట్లాడిన చంద్రబాబు, విద్యార్థుల్లో విటమిన్ లోపాలు తలెత్తకుండా పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొంటూ, నాణ్యమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి సూచనలకు స్పందించిన మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఉదయం రాగి మాల్ట్, మధ్యాహ్న భోజనంతో పాటు చిక్కీ అందిస్తున్నామని, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు శాస్త్రీయ విధానాలను అమలు చేస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్యమంత్రితో కలిసి ఫొటోలు దిగాలని కోరగా, చంద్రబాబు వారితో ఆప్యాయంగా ముచ్చటించి సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు దిగారు. విద్యార్థులతో కొంతసేపు గడిపిన సీఎం, వారి చదువులు, ఆరోగ్యం, పాఠశాల సౌకర్యాల గురించి కూడా ఆరా తీశారు.