కారేపల్లి, మహా:ఢిల్లీలో విద్యార్థుల పై మోడీ ప్రభుత్వ నిర్బంధకాండ కు నిరసిస్తూ విద్యార్థి సంఘాల పిలుపుమేరకు సింగరేణి మండలంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా విద్యార్థులతో అంబేద్కర్ సెంటర్ నుంచి కారేపల్లి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈ బంద్ కు సీపీఐ(ఎం) నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్ కుమార్, జిల్లా మాజీ అధ్యక్షులు కే నరేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కొండబోయిన నాగేశ్వరావు మాట్లాడుతూ జులై 20 తారీకు భారతదేశ చరిత్రలో చీకటి రోజు అని పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ కు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్, వాటర్ క్యానన్స్, డియర్ గ్యాస్, భాష్పవాయు ప్రయోగించడం మోడీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల చదువుకు భద్రత కల్పించలేని ప్రభుత్వం ఈ భారతదేశాన్ని ఎలా కాపాడుతుందన్నారు. లీకేజీకి ప్రధాన భాధ్యుడైన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుంచి తొలగించకుండా సమస్య నుంచి పక్కదారి పట్టించడం కోసం మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విద్యాసంస్థల బంద్, ర్యాలీలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు చిలుముల భరత్, కాకాటి పృద్వి, ఆదెర్ల నాగరాజు, భూక్య శరత్, ఎడారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.








