Mahaa Daily Exclusive

  నీట్ లీక్‌పై మోదీ అత్యంత ఆందోళన చెందారు…

Share

నీట్ లీక్‌పై మోదీ అత్యంత ఆందోళన చెందారు.
• ఢిల్లీ ఘటనల్లో దేశవ్యతిరేక శక్తుల కుట్ర.
• కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.

హైదరాబాద్, మహా.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అత్యంత సున్నితమైన అంశమని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు సహా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. అలాగే ఢిల్లీలో జరిగిన నిరసనల్లో విద్యార్థుల ముసుగులో కొన్ని కమ్యూనల్, కమ్యూనిస్టు శక్తులు అరాచకాలకు పాల్పడ్డాయని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో తీసుకుందని చెప్పారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే 11 మంది ఫ్యాకల్టీ సభ్యులతో పాటు మొత్తం 17 మందిని అరెస్టు చేసిందని తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

విద్యార్థుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుందని, ఈ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పారని గుర్తుచేశారు. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా కేవలం 40 రోజుల్లోనే పరీక్షలను మళ్లీ నిర్వహించి ఫలితాలు ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆందోళనలపై స్పందిస్తూ, విద్యార్థుల ముసుగులో కొన్ని కమ్యూనల్, కమ్యూనిస్టు శక్తులు చొరబడి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నడంతో పాటు దేశవ్యతిరేక నినాదాలు కూడా ఆ వ్యూహంలో భాగమేనని అన్నారు. పోలీసులపై, జర్నలిస్టులపై, మహిళా జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతూ అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు.

నీట్ లీకేజీ వంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటోందని, విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.