Mahaa Daily Exclusive

  ఆగస్టు 30 నాటికి రెండు జతల యూనిఫాంలు.

Share

ఆగస్టు 30 నాటికి రెండు జతల యూనిఫాంలు.

• ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు విస్తృత అవగాహన.

• రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

హైదరాబాద్, మహా.

ప్రభుత్వ, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ పాఠశాలల విద్యార్థులందరికీ ఆగస్టు 30 నాటికి రెండు జతల నాణ్యమైన యూనిఫాంలు అందేలా అన్ని దశల్లో పకడ్బందీగా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించాలని, జూలై 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో ప్రత్యామ్నాయ పంటల విత్తన మేళాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

 

శుక్రవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, సెర్ప్ సీఈవో దివ్య, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంజయ్ జాజు, పాఠశాల యూనిఫాంల కుట్టు పనుల పురోగతి, సీజనల్ పరిస్థితులు, పంటల వైవిధ్యీకరణపై సమీక్షించారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి పంటల వైవిధ్యీకరణ అత్యంత ప్రాధాన్య అంశమని సంజయ్ జాజు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే సమయానికి 54 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 14 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.39 కోట్ల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు సగం విస్తీర్ణంలో మాత్రమే సాగు పూర్తైందని తెలిపారు. మిగిలిన భూములను బీడుగా వదిలిపెట్టకుండా కంది, పెసర, మినుములు, అలసందలు, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో బోరు నీటిపై ఆధారపడిన వరి సాగును నిరుత్సాహపరచాలని సూచించారు.

 

జూలై 27 నుంచి 29 వరకు అన్ని రైతు వేదికల్లో ప్రత్యామ్నాయ పంటల విత్తన మేళాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పంటల వైవిధ్యీకరణలో ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలను ప్రభుత్వం అభినందిస్తుందని సంజయ్ జాజు తెలిపారు.

 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలని తెలిపారు. యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, డీఆర్‌డీఏ అధికారులు కుట్టు పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని, వస్త్రాల కటింగ్‌ను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

 

వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 40 శాతం వర్షపాతం లోటు నమోదైందని, జలాశయాలు, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ సాగు, డ్రిప్ సేద్యాన్ని ప్రోత్సహించాలని, ప్రతి గ్రామంలో కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. ఆగస్టులో కొంత వర్షం కురిసినా వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు సరిపోదని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశముందని హెచ్చరించారు.

 

సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ, ఆగస్టు 30 నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందించడమే లక్ష్యమని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల టైలర్లు రెట్టింపు వేగంతో కుట్టు పనులు పూర్తి చేయాలని, వస్త్రాల సరఫరా, కటింగ్, కుట్టు పనులను దశలవారీగా వేగవంతం చేయాలని సూచించారు. మండల స్థాయిలో బటన్ హోల్, బటన్ ఫిక్సింగ్ యంత్రాలను వినియోగించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

 

యూనిఫాంల నాణ్యతపై విద్యార్థుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తామని, లోపాలు తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని సంజయ్ జాజు హెచ్చరించారు. జిల్లా, మండల స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వస్త్రాల సరఫరా నుంచి యూనిఫాంల పంపిణీ వరకు ప్రతి దశను రోజువారీగా పర్యవేక్షించాలని ఆదేశించారు.