డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపాలి.
• కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరిన ఎంపీ ఈటల రాజేందర్.
ఢిల్లీ, మహా.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరారు. ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ జనాభా కేవలం 30 లక్షలు ఉన్న సమయంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం నగర జనాభా రెండు కోట్లకు పైగా పెరిగినా ఇప్పటికీ నగరంలోని దాదాపు మొత్తం చెత్తను అదే ప్రాంతంలో వేస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రతిరోజూ సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త అక్కడికి తరలించడంతో చెత్త కొండలు పేరుకుపోయాయని, దాని ప్రభావం 40 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలపై పడుతోందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సంపాదించిన డబ్బంతా వైద్య ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
జవహర్‌నగర్‌లో ఇకపై ఒక్క కిలో చెత్త కూడా వేయకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, గాలి, నీటి కాలుష్యానికి తావులేని ‘జీరో పొల్యూషన్’ సాంకేతికతతో చెత్తను రీసైక్లింగ్ చేసే విధానాన్ని అమలు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. ఢిల్లీ వంటి మహానగరాల్లో అమలవుతున్న ఆధునిక వ్యర్థాల నిర్వహణ విధానాలను హైదరాబాద్‌లో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం జవహర్‌నగర్‌లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ సామర్థ్యం కేవలం 3,500 మెట్రిక్ టన్నులు మాత్రమేనని, కానీ రోజుకు దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందని ఈటల రాజేందర్ తెలిపారు. ప్లాంట్ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా అన్న అంశాన్ని పర్యవేక్షించే వ్యవస్థ కూడా లేదని విమర్శించారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై తాను ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని, బాధిత ప్రజల పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. జవహర్‌నగర్ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.








