Mahaa Daily Exclusive

  వ్యక్తిత్వ వికాసం, దేశ నిర్మాణానికే విద్య….

Share

వ్యక్తిత్వ వికాసం, దేశ నిర్మాణానికే విద్య.
* అమృత వర్సిటీ స్నాతకోత్సవంలో ఎం. వెంకయ్య నాయుడు.

అమరావతి, మహా.

విద్య అనేది కేవలం ఉపాధి పొందడానికి మాత్రమే పరిమితం కాకూడదని, అది విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మరియు దేశ పునర్నిర్మాణానికి బలంగా దోహదపడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. అమరావతిలో ఘనంగా జరిగిన అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్‌తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్న ఆయన, పట్టభద్రులైన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

*మాతృభూమికి సేవ చేయండి.. సంస్కారాన్ని మరువకండి*

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినా, తిరిగి మాతృభూమికి చేరుకుని దేశ పురోగతికి సేవ చేయాలని వెంకయ్య నాయుడు యువతకు పిలుపునిచ్చారు. చదువు కేవలం అక్షర జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఉన్నతమైన సంస్కారాన్ని నేర్పాలని ఆయన ఆకాంక్షించారు. దినచర్యలో భాగంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు పనులన్నీ పూర్తి చేసుకునే సత్సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.
కుటుంబ వ్యవస్థకు భారతదేశం మూలస్తంభం లాంటిదని, బిజీ జీవితంలోనూ తల్లిదండ్రులతో నాణ్యమైన సమయాన్ని గడపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ వేదికపై భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని, ఒకప్పుడు నలందా, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచ దేశాల విద్యార్థులకు విద్యనందించి భారత్ విశ్వ గురువు గా వెలుగొందిందని ఆయన సగర్వంగా ప్రస్తావించారు.

*నా రాజకీయ ప్రస్థానంలో ఒక్క రూపాయి సొంతం ఖర్చు చేయలేదు*

ఈ వేదికగా వెంకయ్య నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపారు.
“నేను పాఠశాల స్థాయి నుంచే విద్యార్థి నాయకుడిగా పని చేశాను. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ఏకంగా 17 నెలల పాటు జైలు జీవితం గడిపాను. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 30 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే గడిపాను. రాజకీయాల్లో ఉండగా నా జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఒకప్పుడు ఏ అటల్ బిహారీ వాజ్‌పేయి పేరునైతే నేను గోడల మీద రాశానో, కాలక్రమంలో అదే వాజ్‌పేయితో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఒకే వేదికపై కూర్చోవడం నా జీవితంలో మరువలేని ఘట్టం.”

*కఠిన మార్గమే ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది: మంత్రి నారా లోకేష్*

ఈ స్నాతకోత్సవ సభలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ, యువత భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన అవకాశాల కోసం ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని వివరించారు.
విద్యార్థులు వైఫల్యాలను చూసి ఏమాత్రం భయపడకూడదని, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలని సూచించారు. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఎల్లప్పుడూ సవాళ్లతో కూడిన కఠినమైన మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలని, శ్రమను నమ్ముకుంటే విజయం తథ్యమని లోకేష్ యువతకు దిశానిర్దేశం చేశారు.