విద్యార్థి నిరసనకారులకు రాహుల్ గాంధీ మద్దతు.
• బెదిరింపులకు భయపడొద్దు.
• క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు.
ఢిల్లీ, మహా.
ఇటీవల విద్యార్థుల నిరసనల నేపథ్యంలో వివాదంలో నిలిచిన విద్యార్థి ఉద్యమకారులకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. ఢిల్లీలోని తన నివాసం 10 జన్పథ్ వద్ద విద్యార్థి నిరసనకారులతో సమావేశమైన ఆయన, వారిని “రాజ్యాంగ సంరక్షకులు”గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వారు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు కోసం, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు యువత గళం విప్పడం నేరం కాదన్నారు. లోపభూయిష్టమైన వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కని పేర్కొన్నారు. విద్యార్థులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పటికీ వారిపై లాఠీచార్జీలు, బెదిరింపులు, కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని విమర్శించారు.
ప్రధానిపై వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఓ బాలిక క్షమాపణ చెప్పిన ఘటనపై స్పందించిన రాహుల్, విద్యార్థులను భయపెట్టి క్షమాపణలు చెప్పించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై ఒత్తిడి తేవడం మానేసి, వారి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షా పత్రాల లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలని, యువతకు భరోసా కల్పించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సమావేశంలో పాల్గొన్న విద్యార్థి కార్యకర్త రియా అహిర్ మాట్లాడుతూ, ముంబైలో పోలీసు వ్యాన్ను అడ్డుకున్న ఘటన తర్వాత తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థులను అక్రమంగా నిర్బంధించకుండా అడ్డుకోవడమే తాను చేసిన పని అని, అయినప్పటికీ తనను వేధిస్తున్నారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిపారు.
మరో విద్యార్థి నిరసనకారిణి ఫరా నాజ్ మాట్లాడుతూ, జులై 20న జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. తమను అదుపులోకి తీసుకుని దేశద్రోహులుగా ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ప్రజాస్వామ్య హక్కుల కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.








