కమలనాథుల ఐక్యతా రాగం.
* బండి సంజయ్ ఇంట సందడి చేసిన ఈటల, లక్ష్మణ్.
* తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం.
* అధిష్టానం చొరవతో సమసిపోతున్న విబేధాలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అత్యంత ఆసక్తికర, సానుకూల పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నాయకత్వంలో కీలక స్తంభాలుగా భావించే అగ్రనేతలు తమ మధ్య ఉన్న మనస్పర్థలను పక్కనపెట్టి ఆత్మీయంగా కలుసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు సమావేశమయ్యారు. బండి సంజయ్ ఇచ్చిన ప్రత్యేక విందుకు హాజరైన ఈ నేతలు లంచ్ చేస్తూనే తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫోటోలను బండి సంజయ్ తన అధికారిక సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. “మంచి సంభాషణలు ఎప్పుడూ కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత కొంతకాలంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, ఇరువురి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. ఇలాంటి ప్రతికూల తరుణంలో వీరంతా ఒకేచోట చేరి నవ్వులు చిందిస్తూ విందులో పాల్గొనడం టీ-బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపింది.
తెలంగాణలో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ అధిష్టానం.. పార్టీ ఎదుగుదలకు సంస్థాగతంగా ఉన్న అడ్డంకులను తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బలమైన మాస్ ఇమేజ్ ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఉన్న గ్యాప్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తోందని జాతీయ నాయకత్వం గ్రహించింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న వీరి విభేదాలకు చెక్ పెట్టి, రాష్ట్రంలో అగ్రనేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని వ్యూహరచన చేసింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ గత నెలలో స్వయంగా రంగంలోకి దిగి ట్రబుల్ షూటర్ పాత్ర పోషించారు. హైదరాబాద్‌లోని ఎంపీ లక్ష్మణ్ నివాసం వేదికగా బండి సంజయ్, ఈటల రాజేందర్‌లతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా సమష్టిగా ముందుకు సాగాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఆ సమావేశంలో అధిష్టానం దూత సమక్షంలోనే నేతలిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకొని మనస్పర్థలు వీడారు. ఆ భేటీ జరిగి నెల రోజులు కూడా గడవకముందే, ఇప్పుడు ఢిల్లీలో మరోసారి ఈ సీనియర్ నేతలంతా కలుసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతోంది.








