ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.
* భూ బదిలీలు, ట్విన్ టవర్స్, పీపీపీ పాలసీకి ఆమోదం.
అమరావతి, మహా.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.
ఏదుల ముస్తూరులో 19.55 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు బదిలీ చేసేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. అలాగే తిమ్మసముద్రంలో 13.45 ఎకరాల భూమిని రాజధాని పట్టణాభివృద్ధి సంస్థ కు బదిలీ చేయడానికి కూడా ఆమోదం తెలిపిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ చేపడుతూ యూడీఏల సంఖ్యను 21 నుంచి 23కు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధికి ఊతమిచ్చేలా కండలేరు నుంచి ఇండస్ట్రియల్ క్లస్టర్‌కు నీటి సరఫరా ప్రతిపాదనకూ ఆమోదం లభించిందని చెప్పారు.
విజయవాడ ఆటోనగర్ కాలనీవాసుల యూడీఎస్ హక్కులను క్రమబద్ధీకరించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని, 400 హౌసింగ్ యూనిట్లకు సంబంధించిన భూ సమస్యకు కూడా పరిష్కారం చూపినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రతిష్ఠాత్మక ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు సవరించిన టెండర్లను మంత్రివర్గం ఆమోదించిందని, ఎత్తైన నిర్మాణంగా దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అమరావతిలో 47 అంతస్తులతో ట్విన్ టవర్స్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ టవర్స్‌లో కార్పొరేట్ సంస్థలు, క్వాంటమ్ టెక్నాలజీ సంస్థలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. హైకోర్టు భవన రీ-డిజైన్ ప్రతిపాదనకూ గ్రీన్‌సిగ్నల్ లభించిందని పేర్కొన్నారు.
పెట్టుబడులను ఆకర్షించడం, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా ఆమ్నిబస్ చట్టం-2026ను తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను తొలగించి పారిశ్రామిక వృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అలాగే ఏపీ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీ-2026కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, పీపీపీ ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడమే కొత్త పాలసీ లక్ష్యమని స్పష్టం చేశారు.
కుప్పం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం భూసేకరణలో డి-ఫామ్ లేని సాగుదారులకు ఎకరాకు రూ.12.44 లక్షల ప్రత్యేక పరిహారం చెల్లించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు. అలాగే మోతడక ప్రాంతంలో 2,344 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఆమోదం లభించిందని తెలిపారు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.








