సామాజిక న్యాయ తెలంగాణే లక్ష్యం.
* బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం రాకపోతే ఢిల్లీలో ఉద్యమం.
* టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత.
హైదరాబాద్, మహా.
సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించిన **’సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’**లో ఆమె మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం కోసం నిజాయితీగా కృషి చేయలేదని విమర్శించారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, అణగారిన వర్గాల జీవితాల్లో మార్పుకు బాటలు వేస్తుందని అన్నారు.
సామాజిక న్యాయం అనే అంశాన్ని ప్రస్తావించగానే కొందరు భయపడుతున్నారని, అయితే ఇది ఎవరికీ వ్యతిరేకమైన పోరాటం కాదని, ధర్మం కోసం చేసే ఉద్యమమని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంచిందని ఆరోపించిన ఆమె, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరస్పరం రాజకీయ అనుబంధం కొనసాగిస్తున్నప్పటికీ, బీసీ బిల్లుకు ఆమోదం తెప్పించే విషయంలో మాత్రం ఆ చొరవ కనిపించడం లేదని ప్రశ్నించారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల లోపు బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకపోతే, సంక్రాంతి తర్వాత ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కవిత హెచ్చరించారు. బీసీల హక్కుల సాధన కోసం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇప్పటికీ కుల వివక్ష పూర్తిగా అంతరించిపోలేదని పేర్కొన్న కవిత, తాను అగ్రవర్ణ కుటుంబంలో జన్మించినప్పటికీ అణగారిన వర్గాల హక్కుల కోసం చివరి వరకు పోరాడతానని తెలిపారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు అగ్రవర్ణాలకు చెందిన వారంతా కూడా బుద్ధుడి ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్‌కు తగిన గౌరవం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఆయనకు మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సిఫార్సు చేయాలని కోరారు.








