Mahaa Daily Exclusive

  జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి రెండు నిమిషాలు చాలు….

Share

జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి రెండు నిమిషాలు చాలు.
* స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.
* మంత్రులకు కేబినెట్ సమావేశంలో సిఎం చంద్రబాబు దిశానిర్దేశం.

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. మూడున్నర గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అభివృద్ధి కార్యక్రమాలు, చట్టవ్యవస్థ, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, “జగన్ అండ్ కో చేస్తున్న అరాచకాలను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు. కానీ రాజకీయాల ముసుగులో నేరాలకు పాల్పడుతున్నందున చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని, ప్రభుత్వం ఇప్పటికే అన్ని అంశాలను ప్రజలకు వివరించిందని చెప్పారు. రిజర్వేషన్లపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత మంత్రులదేనని సూచించారు.
ఈ నెలాఖరులో వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి సరఫరా కొనసాగిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ఇటీవల ప్రారంభమైన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిందని, ఆ ప్రారంభోత్సవంలో గిరిజన థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. స్వర్ణాంధ్ర–వికసిత్ భారత్ లక్ష్యాలను స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రస్తావించాలని సూచించారు. క్వాంటం వ్యాలీ ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
‘దిశా’ చట్టం అసలు అమల్లోకి రాలేదని, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ గత ప్రభుత్వం దానిపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. దిశా పోలీస్ స్టేషన్లు, వాహనాల పేరుతో హడావుడి చేశారని విమర్శించారు.
దేవరపల్లి పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రైతుల పొలాలను ధ్వంసం చేశారని, చిరు వ్యాపారుల జీవనోపాధికి నష్టం కలిగించారని, దేవతల చిత్రాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రైతులు తమ పంటలు నాశనమయ్యాయని తనకు సందేశాలు పంపారని పేర్కొన్నారు. జగన్ పర్యటనలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
రాజకీయ పార్టీల ముసుగులో నేరగాళ్లు తయారవుతున్నారని, ప్రశాంత జిల్లాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు రైతులు, ఆక్వా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ఆక్వా రంగానికి రూ.1,100 కోట్ల విద్యుత్ రాయితీలు అందించామని, ఆక్వా ఫీడ్ ఎగుమతులపై సుంకాలను 50 శాతం తగ్గించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఈ నెల 13న అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తామని తెలిపారు. అదే రోజు ఎమ్మెల్యే క్వార్టర్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, విజయదశమి నాటికి మంత్రుల నివాసాలను సిద్ధం చేస్తామని చెప్పారు.
కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపైనా విస్తృతంగా చర్చ జరిగింది. 11 రాష్ట్రాలకు చెందిన బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కేబినెట్ ఉపసంఘాన్ని ఆదేశించారు. భూముల వేలంలో సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు. పదిహేనేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులందరికీ సముచిత పరిష్కారం లభించేలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు.