*ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు
*ప్రాణాలు పోతున్న పట్టించుకోని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి
*చికిత్స లో నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి చెందాడని బంధువుల ఆరోపణ
*రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేస్తున్న బంధువులు
హనుమకొండ, మహా ;
శ్రీ బాలాజీ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న చికిత్సలో నిర్లక్ష్యం వల్లే పంజాల శ్రీధర్ మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు బాధిత కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గాని, సంబంధిత అధికారులు ఏ మాత్రం స్పందించ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే హనుమకొండ డిఎంహెచ్ ఓ గత నాలుగేళ్లుగా హనుమకొండలోనే పనిచేసి, కొన్ని కారణాల వల్ల ఆయన బదిలీ పై వెళ్లి మరల నెల రోజుల వ్యవధిలోనే అదే స్థానంలో బాధ్యతలు చేపట్టిన డీఎంహెచ్‌ఓ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్న ప్రైవేట్ ఆస్పత్రులు ఆర్థిక వ్యాపార కేంద్రాలుగా మారాయి అన్న ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రజల ప్రాణాలు పోతున్న ఆయన ఘటనలను కూడా ఏమాత్రం స్పందించడం లేదనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న సంఘటనలు అందించే వైద్యంలో నిర్లక్ష్యం పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు అండగా నిలవడానికేనా ఉన్నత ఉద్యోగాలు పదవులు? లేక పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా పర్యవేక్షించడానికా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
హనుమకొండ విజయ టాకీస్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నెక్కొండ మండలం బుల్లికొండ గ్రామానికి చెందిన పంజాల శ్రీధర్ (32)కు సంబంధించి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రెయిన్ సర్జరీ అనంతరం రెండు రోజులుగా ఎలాంటి స్పందన లేకపోయినా వెంటిలేటర్ పై ఉంచి బిల్లులు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడిని తొలుత మరో ప్రైవేట్ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం పేరుతో ఈ ఆస్పత్రికి తరలించారని
తెలిపారు. రోగి పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా భారీ బిల్లులు వేస్తున్నారని, ఆరోగ్యశ్రీ ప్రక్రియలో ఉన్నప్పటికీ రూ.70 వేల వరకు వసూలు చేశారని ఆరోపించారు.
బిల్లులు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ ఘటన పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు.








