భద్రాచలం–వాజేడు రహదారికి త్వరలో మోక్షం?
* వారం రోజుల్లో పనులు మొదలు పెట్టకపోతే కాంట్రాక్టర్ మార్పు కోరిన మంత్రి తుమ్మల.
* రూ.115.28 కోట్లతో 112.6 కి.మీ. రహదారి అభివృద్ధికి వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు.
భద్రాచలం, మహా.
భద్రాచలం నుంచి వాజేడు వరకు అధ్వాన్నంగా మారిన రహదారి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ మార్గంలో ప్రయాణించిన సందర్భంగా రహదారి దుస్థితిని చూసిన స్థానికులు మంత్రిని అడ్డుకుని తమ సమస్యలను వివరించగా.. వెంటనే స్పందించిన ఆయన ఆంధ్రప్రదేశ్ రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉన్న సమయంలో ఈ రహదారి నిర్మాణం జరిగిందని, అనంతరం ఏళ్లుగా మరమ్మతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు మంత్రికి వివరించారు. కేవలం 100 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పడుతోందని, రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను విన్న వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఆంధ్రప్రదేశ్ ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి రహదారి మరమ్మతులు, అభివృద్ధి పనులను అత్యవసరంగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రహదారి అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరైనా కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం ఆందోళనకరమన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే ప్రస్తుత కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేయాలని మంత్రి జనార్దన్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
భద్రాచలం–వాజేడు రహదారి అభివృద్ధి పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. భద్రాచలం నుంచి ఏటపాక వరకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 7.8 కిలోమీటర్ల రహదారిని రూ.3.70 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఏటపాక నుంచి చర్ల మండలంలోని సుబ్బంపేట వరకు 56.8 కిలోమీటర్ల మేర భద్రాద్రి డివిజన్ పరిధిలో రూ.67.58 కోట్లతో పనులు చేపట్టనున్నారు. సుబ్బంపేట నుంచి వాజేడు వరకు ములుగు డివిజన్ పరిధిలోని 48 కిలోమీటర్ల రహదారిని రూ.44 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 112.6 కిలోమీటర్ల పొడవున రూ.115.28 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది.
ఈ పనులను ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ చీఫ్ ఇంజినీర్ బీవీ రావు పర్యవేక్షించనుండగా, భద్రాచలం, ములుగు ఆర్‌అండ్‌బీ ఈఈలు క్షేత్రస్థాయిలో అమలు బాధ్యతలు నిర్వహించనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ మార్గంలో ప్రయాణిస్తారని గుర్తు చేసిన మంత్రి తుమ్మల, రహదారి దుస్థితి వల్ల భక్తులు, స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అందువల్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.








