Mahaa Daily Exclusive

  చెరువుల్లోకి శుద్ధి జలాలే లక్ష్యం….

Share

చెరువుల్లోకి శుద్ధి జలాలే లక్ష్యం.
* తక్కువ ఖర్చుతో నీటి శుద్ధికి కొత్త సాంకేతికతపై హైడ్రా అధ్యయనం.

హైదరాబాద్, మహా.
నగరంలోని చెరువుల పునరుద్ధరణలో మరో ముందడుగు వేస్తూ, శుద్ధి చేసిన జలాలను చెరువుల్లోకి మళ్లించే విధానాలపై హైడ్రా దృష్టి సారించింది. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ఇప్పటికే ఇన్‌లెట్ల అభివృద్ధి చేపట్టిన హైడ్రా.. ఇప్పుడు తక్కువ వ్యయంతో నీటిని శుద్ధి చేసే ఆధునిక సాంకేతికతలను పరిశీలిస్తోంది.

ఈ నేపథ్యంలో బిట్స్ పిలానీ–కేకే బిర్లా గోవా క్యాంపస్ అభివృద్ధి చేసిన వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీ’ పై హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ అధ్యయనం చేశారు. బిట్స్ పిలానీ ఆహ్వానం మేరకు గురువారం గోవా వెళ్లిన ఆయన, స్థిరమైన మురుగునీటి నిర్వహణ, పట్టణ సరస్సుల పునరుద్ధరణకు సంబంధించిన పలు సాంకేతిక విధానాలను పరిశీలించారు.

పర్యటనలో భాగంగా ఎస్‌బీఆర్ , ఎంబీఆర్ , వెట్‌ల్యాండ్ ట్రీట్‌మెంట్ సాంకేతికతలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను తిలకించారు. హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాఫ్ట్స్ సంస్థ ప్రతినిధి యూనస్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

కేవలం సాంకేతిక ప్రదర్శనకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఈ విధానాల ద్వారా మురుగునీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే అంశాన్ని హైడ్రా బృందం ప్రత్యక్షంగా పరిశీలించింది. తక్కువ విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం, దీర్ఘకాలిక సామర్థ్యం, ప్రకృతి ఆధారిత నీటి శుద్ధి విధానాలను అధ్యయనం చేసింది.

ఈ సాంకేతికత ద్వారా నీటి నాణ్యత మెరుగుపడటంతో పాటు పర్యావరణ పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణకు కూడా గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ప్రొఫెసర్లు వివరించారు.

హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పాతబస్తీలోని బమృకున్-ఉద్-దౌలా చెరువు వద్ద ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఫలితాలను పరిశీలించాలని నిర్ణయించినట్లు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే నగరంలోని ఇతర చెరువుల పునరుద్ధరణలో కూడా ఇదే సాంకేతికతను అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు.