Mahaa Daily Exclusive

  మహిళలకు ఏసీ బస్సుల్లోనూ ప్రత్యేక రాయితీ….

Share

మహిళలకు ఏసీ బస్సుల్లోనూ ప్రత్యేక రాయితీ.
• 15 రోజుల చార్జీతో నెలరోజుల ప్రయాణం..
• బస్‌పాస్‌ వినియోగదారులకు టీజీఎస్‌ఆర్టీసీ కొత్త ఆఫర్లు.
హైదరాబాద్, మహా .
తెలంగాణ మహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త అందించింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న ఆర్టీసీ.. తాజాగా ఏసీ బస్సుల్లోనూ ప్రత్యేక రాయితీని ప్రకటించింది. నెలవారీ బస్‌పాస్‌ తీసుకునే మహిళలు ఇకపై కేవలం 15 రోజుల చార్జీ చెల్లించి, 30 రోజుల పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. రోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర అవసరాల నిమిత్తం ఏసీ బస్సుల్లో రాకపోకలు సాగించే మహిళలకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది.
ఏసీ బస్సుల ప్రయాణంపై సగం చార్జీ భారం తగ్గింపు
మహాలక్ష్మి పథకం కింద అమలవుతున్న ఉచిత ప్రయాణ సదుపాయం ఏసీ బస్సులకు వర్తించకపోవడంతో, వాటిలో ప్రయాణించే మహిళలు ఇప్పటివరకు సాధారణ టికెట్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నెలవారీ పాస్‌ విధానంలో ప్రత్యేక రాయితీని తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 15 రోజుల చార్జీతో నెలరోజుల ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడంతో తరచూ ఏసీ బస్సులను ఆశ్రయించే మహిళలకు నెలవారీ ప్రయాణ ఖర్చులు సగానికి తగ్గనున్నాయి.
బస్‌పాస్‌లపై మరో 9 రకాల ప్రయోజనాలు
బస్‌పాస్‌ల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ మొత్తం తొమ్మిది రకాల రాయితీలు, ప్రత్యేక ప్రయోజనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. వివిధ వర్గాల పాస్‌ వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం నెలవారీ సీజన్‌ టికెట్లపై 30 రోజుల ప్రయాణానికి 20 రోజుల చార్జీ వసూలు చేసే విధానం అమల్లో ఉండగా, తాజా రాయితీలు ప్రయాణికులకు అదనపు లబ్ధిని చేకూర్చనున్నాయి.
నవంబర్ 14 నుంచే కొత్త ఆఫర్లు అమల్లోకి
ఈ నూతన రాయితీలు నవంబర్‌ 14, శనివారం నుంచే అమల్లోకి రానున్నాయని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించి బస్సుల్లో ప్రయాణికుల ఆదరణ పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాలను రూపొందించింది. కొత్తగా ప్రకటించిన తొమ్మిది రాయితీల పూర్తి వివరాలు, అర్హతలు, పాస్‌ల ధరలు మరియు ఏసీ బస్సులకు వర్తించే రూట్లపై ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.