Mahaa Daily Exclusive

  జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్లపై హైకోర్టు స్టే….

Share

జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్లపై హైకోర్టు స్టే.
• రూ.5 కోట్ల టెండర్‌లో అక్రమాల ఆరోపణలు.
• కొత్త ఏజెన్సీ విధుల్లో చేరొద్దని ఆదేశం.

హైదరాబాద్, మహా .

జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి సంబంధించి చేపట్టిన రూ.5 కోట్ల టెండర్ వ్యవహారం న్యాయస్థానం ముందుకు చేరింది. టెండర్ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 16వ తేదీలోగా సమర్పించాలని జేఎన్‌టీయూ యాజమాన్యాన్ని ఆదేశించింది. న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యే వరకు కొత్త సెక్యూరిటీ ఏజెన్సీ విధుల్లో చేరకూడదని స్పష్టం చేస్తూ, బి సెక్యూర్ ప్రొటెక్షన్ సంస్థకు అప్పగించిన భద్రతా బాధ్యతల అమలుపై మధ్యంతర స్టే విధించింది.
పిల్ దాఖలు చేసిన పరిశోధక విద్యార్థి
జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిశోధక విద్యార్థి జవ్వాజి దిలీప్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు యూనివర్సిటీ యాజమాన్యం నుంచి వివరణ కోరింది.
16వ తేదీలోగా పూర్తి వివరాలు ఇవ్వాలి
టెండర్ ప్రక్రియకు సంబంధించిన అధికారిక పత్రాలు, కమిటీ నిర్ణయాలు, ఇతర వివరాలను ఈ నెల 16వ తేదీలోగా న్యాయస్థానానికి సమర్పించాలని యూనివర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు కొత్త ఏజెన్సీ సెక్యూరిటీ విధులను చేపట్టకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో టెండర్ దక్కించుకున్న కొత్త ఏజెన్సీ భద్రతా నిర్వహణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదులు
టెండర్ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్ విభాగాలకు ఫిర్యాదులు చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జేఎన్‌టీయూ వైస్‌ఛాన్సలర్‌పై వచ్చిన ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. టెండర్ ఖరారులో అనుసరించిన విధివిధానాలు, ఏజెన్సీ ఎంపిక ప్రక్రియపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
యూనివర్సిటీ వివరణపై సర్వత్రా ఆసక్తి
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 16న జేఎన్‌టీయూ యాజమాన్యం సమర్పించబోయే వివరాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా? పిటిషనర్ చేసిన ఆరోపణల్లో వాస్తవమెంత? ఏజెన్సీ ఎంపికలో ఎలాంటి ప్రమాణాలు పాటించారు? అనే అంశాలపై యూనివర్సిటీ ఇచ్చే వివరణతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో తదుపరి విచారణలో కోర్టు వెలువరించే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.