Mahaa Daily Exclusive

  తెలంగాణ జనసేనలో సంస్థాగత ప్రక్షాళన….

Share

తెలంగాణ జనసేనలో సంస్థాగత ప్రక్షాళన.
• పాత కమిటీలు, ఇన్‌చార్జ్‌ పదవులు రద్దు.
• 2029 ఎన్నికలే లక్ష్యంగా పవన్‌ కల్యాణ్‌ కొత్త వ్యూహం.

హైదరాబాద్‌, మహా:

తెలంగాణలో జనసేన పార్టీ సంస్థాగతంగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. 2029 సాధారణ ఎన్నికలతో పాటు అంతకుముందు జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్‌, కార్పొరేషన్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో బరిలోకి దిగేందుకు పార్టీని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2026 జూన్‌ 2వ తేదీకి ముందు నియమించిన పలు పదవులు, కమిటీలను రద్దు చేస్తున్నట్లు జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

పలు కీలక పదవులకు స్వస్తి

పార్లమెంట్‌, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ పదవులతో పాటు జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఇన్‌చార్జ్‌ బాధ్యతలను రద్దు చేసింది. పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ (పీఓసీ) పదవులు, విద్యార్థి, యువజన, వీర మహిళ విభాగాల బాధ్యతలు, పార్లమెంట్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ల నియామకాలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది. పాత, కొత్త అడహక్‌ కమిటీలకు సైతం ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే 2026 జూన్‌ 2 తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర జాయినింగ్‌ కమిటీ, అధికార ప్రతినిధులు యథావిధిగా కొనసాగుతారని తెలిపింది. రాష్ట్ర ముఖ్య నాయకుల పదవులకు ఈ రద్దు వర్తించదని పేర్కొంది.

అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం

కొత్త కమిటీల ఏర్పాటులో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. యువత, విద్యార్థులు, విద్యావంతులు, మహిళలు, అనుభవజ్ఞులు, మేధావులకు ప్రాధాన్యత ఇవ్వనుంది. పార్టీని కేవలం పదవులు, హోదాలకే పరిమితం చేయకుండా ప్రజల మధ్య నిరంతరం పనిచేసే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు, సూచనలు, భవిష్యత్‌ కార్యాచరణకు అనుగుణంగా తెలంగాణలో కొత్త సంస్థాగత వ్యవస్థను రూపొందించనున్నారు.

క్షేత్రస్థాయి నాయకులకు గుర్తింపు

పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులు, జనసైనికులు, వీర మహిళల వివరాలను సేకరించి, వారి పనితీరు, అంకితభావం, అనుభవం ఆధారంగా కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. సమష్టి చర్చల అనంతరం కమిటీల కూర్పుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో పార్టీ పదవుల్లో పనిచేసిన వారి బాధ్యతలు రద్దు కావడం వారి సేవలకు ముగింపు కాదని జనసేన స్పష్టం చేసింది. మరింత క్రమబద్ధమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగానే ఈ మార్పులు చేపడుతున్నట్లు వివరించింది.

ఎన్నికల సమరానికి ముందస్తు సన్నద్ధత

2029 సాధారణ ఎన్నికలతో పాటు అంతకుముందు జరగనున్న జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో పార్టీ బలాన్ని నిరూపించుకునేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని భావిస్తోంది. అర్హత, అనుభవం, అంకితభావం, పనితీరును ప్రామాణికంగా తీసుకుని నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించనుంది. పార్టీ సిద్ధాంతాలు, పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు, ప్రజా సమస్యలపై పోరాట స్ఫూర్తిని తెలంగాణలో మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ పునర్వ్యవస్థీకరణను కీలక అడుగుగా జనసేన భావిస్తోంది.