Mahaa Daily Exclusive

  మోదీతో ముఖాముఖి చర్చకు సిద్ధం….

Share

మోదీతో ముఖాముఖి చర్చకు సిద్ధం.
* చర్చ జరిగితే ప్రధాని పదవిలో కొనసాగలేరు.
* రాహుల్‌ గాంధీ.

న్యూఢిల్లీ, మహా:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. తనతో చర్చకు మోదీ అంగీకరిస్తే అనేక అంశాలు బయటపడతాయని, ఆ తర్వాత ఆయన ప్రధానిగా కొనసాగలేరని వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలు, ఓట్ల చోరీ ఆరోపణలు, చైనా వ్యవహారం సహా పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్‌ మీ’ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటులో చర్చకు అవకాశం ఉందని అధికార పక్షం చెబుతున్నప్పటికీ, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాహుల్‌ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు, ఓట్ల చోరీ, చైనా అంశం, మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం. నరవణే పుస్తకం, ఎప్‌స్టీన్‌ వ్యవహారంపై తన అభిప్రాయాలను వెల్లడించకుండా అడ్డుకున్నారని అన్నారు. తన మైక్రోఫోన్‌ కూడా నిలిపివేశారని ఆరోపించారు.

సుదీర్ఘ ప్రసంగాలతో కూడిన పార్లమెంటరీ చర్చ కంటే ప్రధాని, తన మధ్య నేరుగా ముఖాముఖి చర్చ జరగాలని రాహుల్‌ ఆకాంక్షించారు. ఒకే వేదికపై ఇద్దరూ కూర్చొని పరస్పరం ప్రశ్నలు వేసుకోవాలని అన్నారు. చర్చకు మధ్యవర్తిగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీని లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను నియమించినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

రాహుల్‌ సవాలుపై బీజేపీ స్పందన

రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో చర్చలకు రాహులే దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. ప్రధానితో ప్రత్యేకంగా చర్చకు వేదిక కోరడం కంటే పార్లమెంటులోనే చర్చించాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పందిస్తూ.. పార్లమెంటే చర్చలకు సరైన వేదిక అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ మరింత బాధ్యతాయుతంగా, గంభీరంగా వ్యవహరించాలని సూచించారు.

సోనియా పుస్తకంపై ఆసక్తికర వ్యాఖ్యలు

తన తల్లి సోనియా గాంధీ ఇటీవల విడుదల చేసిన ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకంపైనా రాహుల్‌ మాట్లాడారు. పుస్తకం చాలా గొప్పదని, బీజేపీ నాయకులు సైతం ఆసక్తిగా చదువుతున్నారని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీని వ్యక్తిగతంగా ఇష్టపడే బీజేపీ నేతలు చాలామంది ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోతున్నారని అన్నారు. పుస్తకంపై వారు చేసే వ్యాఖ్యలు దాని అమ్మకాలు పెరగడానికి దోహదపడుతున్నాయని చమత్కరించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, ప్రధాని మోదీ తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారని రాహుల్‌ మరోసారి ఆరోపించారు. ఈ విషయం మోదీకి కూడా తెలుసని పేర్కొంటూ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. ముఖాముఖి చర్చకు ప్రధాని అంగీకరించిన రోజున విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరున్నారు? దేశద్రోహులు ఎవరు? ఎంతకాలంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు? అనే విషయాలు బయటపడతాయని రాహుల్‌ వ్యాఖ్యానించారు.