వికారాబాద్ జిల్లాలో విషాదం.
• అండర్–19 క్రికెటర్ నందిని ఆత్మహత్య.
* కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.
* ప్రేమ పేరుతో ఇద్దరు యువకుల వేధింపులే కారణమని ఆరోపణ.
వికారాబాద్,మహా.
క్రికెట్ రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కన్న ఓ యువ క్రీడాకారిణి జీవితం అర్ధంతరంగా ముగిసింది. ఇటీవల బీసీసీఐ అండర్–19 మహిళా జట్టుకు ఎంపికైన వికారాబాద్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల నందిని బలవన్మరణానికి పాల్పడింది. వికారాబాద్ పట్టణంలోని మధు కాలనీలో తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న ఆమె, శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధించడం వల్లే తమ కుమార్తె తీవ్ర మనోవేదనకు గురై ఈ కఠిన నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న క్రీడాకారిణి మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
యాలాల మండలం సంగయ్యపల్లి గ్రామానికి చెందిన నందినికి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. కుమార్తెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో ఆమె క్రికెట్లో శిక్షణ ప్రారంభించింది. చదువుతో పాటు ఆటపైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించిన నందిని, మెరుగైన కోచింగ్ కోసం వికారాబాద్ పట్టణంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ సాధన చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీసీసీఐ అండర్–19 మహిళా జట్టుకు ఎంపికైంది. త్వరలోనే జాతీయ స్థాయి పోటీల్లో తన ప్రతిభను నిరూపించుకోవాలని ఆశిస్తున్న తరుణంలో ఈ ఘోరం జరిగిపోయింది.
ఇద్దరు యువకుల వేధింపులే కారణం..
నందిని మృతిపై కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. అనిల్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో నందిని వెంటపడుతూ వేధిస్తున్నాడని, కృష్ణ అనే మరో యువకుడు అతనికి సహకరించాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేకే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని వారు కన్నీరుమున్నీరయ్యారు.
నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో
నందిని మృతికి కారణమైన యువకులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు వికారాబాద్ పట్టణంలో ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను నిగ్గుతేలుస్తామని పోలీసులు తెలిపారు.








