తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగడం కష్టమేనన్న అభిప్రాయం ఉన్నతస్థాయి వర్గాల్లో వినబడుతోంది. ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని, మే లేదా జూన్ లో నిర్వహించే యోచనను తాజాగా సర్కారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని నేతలు చెబుతున్నా.. ఉన్నతస్థాయిలో అంత సానుకూలత, సీరియస్ నెస్ లేదన్న అభిప్రాయం ఉంది. రైతు భరోసా, ఇతర పథకాల అమలు తరువాత అంటే ఫిబ్రవరి మొదటివారంలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు వెళ్లాలని మొదట ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ఆంశం వల్ల ఎన్నికలు మే లేదా జూన్ లో జరగవచ్చు అని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంది. అయితే ఇచ్చిన హామీ మేరకు 42 శాతానికి పెంచితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు దానికి అడ్డుగా మారుతుంది. జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింంది. కులగణనను కూడా పూర్తి చేసింది. ఆయా లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తూ బీసీ కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాలి. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపిస్తే దానికి అనుగుణంగా ఈసీ నోటిఫికేషన్ జారీచేస్తుంది. అనంతరం 21 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి . దీనికి తోడు గత బీఆర్ఎస్ సర్కార్ .. అమల్లోకి తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం-2018 అమలుపై సందిగ్ధం నెలకొంది.
సమ్మర్ లో సమరం
ఇక పిఆర్ చట్టంలో ఏమైనా మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇదంతా ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. దీంతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆశావహులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఒకవేళ ఇవన్నీ మార్చిలోపు పూర్తి చేసిన ఆ తరువాత టెన్త్ , ఇంటర్, డిగ్రీ, ఎంట్రెన్స్ పరీక్షలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి మే మొదటి వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే జూన్ వరకు పూర్తి చేయవచ్చు అని ప్రభుత్వం తాజాగా ఆలోచిస్తోంది. మునిసిపాలిటీలలో ఆరునెలలు ప్రత్యేక అధికారుల పాలన విధించే అవకాశం ఉంది.








