Mahaa Daily Exclusive

  ఆరోగ్య శ్రీ పథకాన్ని.. అనారోగ్యశ్రీగా మార్చారు – ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

Share

పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని, ఈ పథకం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక అంటూ ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందంటూ ఆమె విమర్శించారు. రూ. 3 వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచేదాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా అంటూ షర్మిల ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆమె మండిపడ్డారు.

ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ.. దానిని చివరకు వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆమె డిమాండ్‌ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలన్నారు.