• ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
• బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
హైదరాబాద్, మహా .
ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గత 25 రోజులుగా ఢిల్లీలో రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు, యువత న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. తమ భవిష్యత్తును ప్రభావితం చేసిన పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యువత డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులపై బలప్రయోగం చేయడం అమానుషమని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ యువత ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. యువత ఈడీ, ఐటీ దాడులకు భయపడే తరం కాదని వ్యాఖ్యానించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ‘మేక్ ఇన్ ఇండియా’కి బదులుగా ‘లీక్ ఇన్ ఇండియా’ పరిస్థితిని తీసుకొచ్చిందంటూ విమర్శించారు. న్యాయం కోరుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీపై విమర్శలు వస్తే ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ఎదుట ఆందోళన చేపట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. విద్యార్థులపై పోలీసు చర్యలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
దేశంలో ఏ ఘటన జరిగినా దానికి కేసీఆర్, కేటీఆర్‌లనే బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి రాజకీయ విమర్శలే తప్ప విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్ బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు.








