Mahaa Daily Exclusive

  వీహెచ్ తర్వాత కాంగ్రెస్ లో నేనే సీనియర్..! ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై చిన్నారెడ్డి ఆవేదన..

Share

  • వీహెచ్ తర్వాత కాంగ్రెస్ లో నేనే సీనియర్
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై చిన్నారెడ్డి ఆవేదన
  • మేఘారెడ్డి ఫిర్యాదు ఆధారంగా మల్లు రవి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపాటు
  • కేబినెట్ హోదాలో ఉన్నప్పుడే ప్రోటోకాల్ వదులుకున్నానని వెల్లడి
  • భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తానన్న చిన్నన్న

వనపర్తి, మహా : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తనను తప్పించటంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి మండిపడ్డారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి తాము ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నానని, క్రమశిక్షణతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తనను ‘ఒక్క పోటుతో కూల్చేశారని’ ఆవేదన వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించిన అనంతరం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని తన సొంతూరు జయన్న తిరుమలాపురంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పార్టీలో తలెత్తిన ఈ సమస్యలకు, తనపై జరిగిన చర్యలకు ఎంపీ, పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి మాత్రమే ప్రధాన కారణమని చిన్నారెడ్డి నేరుగా ఆరోపించారు. స్థానిక పరిణామాల నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు ఆధారంగా మల్లు రవి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు.

మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వేళ అధిష్ఠానంతో మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లినా ఫలితం దక్కలేదని, అందుకే తన పరిస్థితి కూడా అలాగే మారుతుందనే ఉద్దేశంతో తాను ఢిల్లీకి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు కానీ వెళ్లేందుకు ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. పార్టీలో వి.హనుమంతరావు తర్వాత అత్యంత సీనియర్ నాయకుడిని తానేనని చిన్నారెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 42 మంది ఎమ్మెల్యేలతో వనపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, సంతకాల సేకరణతో ఉద్యమానికి ఊపిరి పోసిన చరిత్ర తనదని పేర్కొన్నారు. తనకు పదవి ఇచ్చేటప్పుడే ఉత్తర్వుల్లో ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి విధింపు లేకుండా ‘తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు’ మాత్రమే అని ఇచ్చారని, పైగా కేబినెట్ హోదా ఉన్నప్పుడే తాను ప్రోటోకాల్ సదుపాయాలను వదులుకున్నానని చెప్పారు. తన కుమారుడికి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఎప్పుడూ కోరలేదని, పదవి ఉన్నా లేకున్నా తన వ్యక్తిగత గౌరవం తనకు ఉంటుందని, భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

Latest