Mahaa Daily Exclusive

  ఇంకా నయం రాహుల్ దేశభక్తుడనలేదు..! సీఎం రేవంత్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఫైర్..

Share

  • ఇంకా నయం రాహుల్ దేశభక్తుడనలేదు
  • ఒవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడం యావత్ దేశాన్ని అవమానించడమే
  • సీఎం రేవంత్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఫైర్

హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఒవైసీ బ్రదర్స్ దేశభక్తులంటూ ప్రశంసలు కురిపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇది సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. దేశభక్తులు అంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని, అలాంటి మహోన్నత నాయకులతో ఒవైసీలను పోల్చడమే ఒక విడ్డూరమని ఎద్దేవా చేశారు. అసలు రేవంత్ రెడ్డి ఏ అర్హతను చూసి ఒవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో 15 నిమిషాలు పోలీసులను పక్కకు జరిపితే ఈ దేశంలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తామంటూ బెదిరింపులకు దిగినందుకా? లేక బహిరంగంగా పబ్లిక్‌లో మేము ఆవు మాంసం తింటాం, గోమాంసం బాగుంటుంది అంటూ మాట్లాడినందుకు మెచ్చుకుని దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారా? అసలు దేని కోసం వీళ్లను దేశభక్తులు అంటున్నారో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని, అసలు మీ దృష్టిలో దేశభక్తి అంటే ఏంటో, దేశభక్తికి సీమా రేఖ ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

దేశభక్తి అంటే దేశాన్ని ఒకటిగా కలిపే జాతీయ జెండాకు, జాతీయ గీతానికి, జాతీయ గేయానికి మర్యాద ఇవ్వడమని గుర్తుచేశారు. అసెంబ్లీలో ప్రతిష్టాత్మకమైన వందేమాతరం పాడుతుంటే ఒక్కరంటే ఒక్క మజ్లిస్ ఎమ్మెల్యే గానీ, ఓవైసీతో సహా ఎవ్వరూ కూడా వందేమాతరం కోసం నిలబడలేదని, మరి అలాంటి వాళ్లను చూసి దేశభక్తులు, పేట్రియాటిజం అనడం హాస్యాస్పదమన్నారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్, చైనాలపై ఎలాంటి పేట్రియాటిజం ఉందో, అదే పేట్రియాటిజం ఈ ఒవైసీలకు కూడా ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారేమోనని విమర్శించారు. మోదీకి, అమిత్ షాకి దేశభక్తి ఉందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నందుకు సంతోషమని, కానీ ఒవైసీలకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడం మాత్రం ఈ దేశంలో ప్రతి ఒక్కరినీ ఘోరంగా అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా దేశభక్తి ఉంటే ముందుగా సభల్లో పూర్తిగా వందేమాతరం పాడి నిరూపించుకోవాలని, ఆ రోజే వాళ్లు కూడా దేశభక్తులు అవుతారని స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ బుజ్జగింపు కామెంట్లను తెలంగాణ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారని హెచ్చరించారు.

Latest