- కొండా సురేఖ బర్తరఫ్‌పై బీజేపీ ఎంపీ డీకే అరుణ కామెంట్స్
- సురేఖను బీజేపీలోకి ఆహ్వానించే అంశం చర్చించలేదన్న ఎంపీ
జడ్చర్ల, మహా : కొండా సురేఖ బర్తరఫ్‌పై బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. గతంలో తామిద్దరం మంత్రులుగా కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే కొండా సురేఖను తొలగించడానికి కారణమని ఆరోపించారు. బీసీ మహిళను తొలగించడం ద్వారా కాంగ్రెస్‌కు బీసీలపై ఉన్న గౌరవం బయటపడిందని విమర్శించారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్‌పై మండిపడుతుండగా.. తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం జడ్చర్ల, బాలానగర్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ తనకు సీనియర్ మహిళా నాయకురాలు అని.. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో తాము ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశామని ఆమె గుర్తుచేసుకున్నారు. తోటి మహిళా నాయకురాలు మంత్రిగా తెలంగాణకు సేవలందించడం చూసి అప్పుడు సంతోషించానని.. కానీ ఇప్పుడు అదే నాయకురాలిని మంత్రివర్గం నుంచి తొలగించడం తనకు తీవ్రంగా బాధను కలిగిస్తోందని డీకే అరుణ వ్యాఖ్యానించారు.
కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖను బాధ్యురాలిని చేస్తూ మంత్రివర్గం నుంచి తొలగించడం సమర్థనీయం కాదని డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక మహిళ రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి రావడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. అలాంటి సీనియర్ మహిళా నాయకురాలిపై తీసుకున్న చర్య సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎంతో చేస్తున్నామని చెబుతున్నారని విమర్శించిన డీకే అరుణ.. అయితే ఓ బీసీ మహిళా మంత్రిని కేబినెట్ నుంచి తొలగించడం ద్వారా బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందన్నారు. అయితే కొండా సురేఖను బీజేపీలోకి ఆహ్వానించే అంశంపై ఇప్పటివరకు తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని డీకే అరుణ స్పష్టం చేశారు. దీంతో సురేఖ భవిష్యత్ రాజకీయ అడుగులపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఆమె వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.








