Mahaa Daily Exclusive

  ఆర్టీసీ బస్సు బోల్తా..! డ్రైవర్ మృతి.. పలువురు ప్రయాణికులకు గాయాలు..

Share

కామారెడ్డి, మహా : కామారెడ్డి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తున్న హైదరాబాద్‌-1 డిపోకు చెందిన టీఎస్ 34 జడ్ 0030 ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు జుక్కల్ చౌరస్తా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు రోడ్డు పక్క ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు కింద చిక్కుకుపోవడంతో డ్రైవర్ ఆంజనేయులు మరణించాడు.

ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని… గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడినప్పటికీ, కొందరికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.

మంత్రి పొన్నం దిగ్బ్రాంతి

ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ, కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు, ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితి గురించి ఆరా తీశారు. డ్రైవర్ ఆంజనేయులు మృతి పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Latest