హైదరాబాద్, మహా.
తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా చేయూత పింఛన్లకు అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. పింఛన్ కోసం అవసరమైన ధ్రువపత్రాల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సెర్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ధ్రువపత్రాల కోసం వేచి ఉండకుండా ముందుగా కొత్త పింఛన్ కోసం ఆన్‌లైన్‌లో లేదా నిర్దేశిత మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
చేయూత పింఛన్ పొందేందుకు అర్హత ఉన్నవారు వృద్ధాప్యం, వితంతువు, దివ్యాంగులు తదితర కేటగిరీలకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం పలువురు అభ్యర్థులు రెవెన్యూ కార్యాలయాలు, సదరం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ధ్రువపత్రాల పరిశీలన, మంజూరు ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోంది. దీంతో పత్రాలు చేతికి వచ్చే వరకు పింఛన్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను ప్రభుత్వం, సెర్ప్ అధికారులు గుర్తించి దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేశారు. ధ్రువపత్రాలు ఇంకా మంజూరు కాకపోయినా అర్హులైన అభ్యర్థులు ముందుగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా లేదా నిర్దేశిత మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ సమయంలో సంబంధిత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియలో లభించిన ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసి ఇంకా వాటిని పొందని వారు గడువు ముగిసేలోగా పింఛన్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంటున్నారు.
సెప్టెంబరు 15 కీలక గడువు కావడంతో అర్హులైన వారు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గడువు ముగిసిన తర్వాత కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. దీంతో చేయూత పింఛన్‌కు అర్హత ఉన్నవారు ధ్రువపత్రాల కోసం దరఖాస్తు ప్రక్రియను కొనసాగిస్తూనే, పింఛన్ దరఖాస్తును ముందుగానే నమోదు చేసుకోవడం ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.








